టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా తమ సిబ్బందిపై కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్లు, నాన్-ఫ్లయింగ్ స్టాఫ్ రిటైర్మెంట్ వయసును పెంచుతున్నట్టు ప్రకటించింది. తాజా నిర్ణయం ప్రకారం పైలట్ల పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు, నాన్-ఫ్లయింగ్ సిబ్బంది రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెరగనుంది.
అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఇటీవల జరిగిన టౌన్‌హాల్ సమావేశంలో ఎయిర్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది నవంబరులో విస్తారా ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్ ఇండియాలో విలీనం చేసిన విషయం తెలిసిందే. విస్తారాలో పైలట్ల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లు ఉండగా, ఎయిర్ ఇండియాలో 58 ఏళ్లుగానే కొనసాగుతోంది. ఈ వ్యత్యాసంపై పైలట్లలో కొంతకాలంగా అసంతృప్తి నెలకొనడంతో, రెండు సంస్థల విధానాలను సమానంగా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో సుమారు 24 వేల మంది ఉద్యోగులు ఉండగా, అందులో 3,600 మంది పైలట్లు, 9,500 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. అయితే క్యాబిన్ సిబ్బంది రిటైర్మెంట్ వయసు (ప్రస్తుతం 58 ఏళ్లు) పెంచారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.
వాస్తవానికి ఎయిర్ ఇండియాలో పైలట్ల రిటైర్మెంట్ వయసు అధికారికంగా 58 ఏళ్లు అయినప్పటికీ, డీజీసీఏ నిబంధనల ప్రకారం అనేక మంది పైలట్లు 65 ఏళ్ల వరకు కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ విధానాన్ని అధికారికంగా అమలు చేస్తున్నట్టు భావిస్తున్నారు. అయితే ఈ మార్పులపై ఎయిర్ ఇండియా యాజమాన్యం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.