Diamond: మరోసారి అదృష్టం తలుపుతట్టింది.. రూ.30 లక్షల విలువైన వజ్రాన్ని గుర్తించిన గిరిజన రైతు కుటుంబం!

Diamond: మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా మరోసారి వజ్రాల వార్తతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక గిరిజన రైతు కుటుంబం వరుసగా రెండోసారి విలువైన వజ్రాన్ని గుర్తించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఒక భారీ వజ్రాన్ని వెలికితీసి లక్షాధికారులైన ఈ కుటుంబానికి ఇప్పుడు మరోసారి అదృష్టం కలిసి వచ్చింది.

Madhya Pradesh Couple Found Diamond
Madhya Pradesh Couple Found Diamond

2024లో రూ.93 లక్షల వజ్రం.. ఇప్పుడు మరో రూ.30 లక్షల వజ్రం..

రెండు నెలల శ్రమకు భారీ ఫలితం.. 11.19 క్యారెట్ల వజ్రం వెలికితీత..

మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా మరోసారి వజ్రాల వార్తతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక గిరిజన రైతు కుటుంబం వరుసగా రెండోసారి విలువైన వజ్రాన్ని గుర్తించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ఒక భారీ వజ్రాన్ని వెలికితీసి లక్షాధికారులైన ఈ కుటుంబానికి ఇప్పుడు మరోసారి అదృష్టం కలిసి వచ్చింది.

పన్నా జిల్లాలోని అహిర్గావ్ ప్రాంతానికి చెందిన రాకేష్ ఆదివాసీ, అతని ముగ్గురు సోదరులు, బంధువులు కలిసి ఈ ఏడాది ఏప్రిల్లో గనుల లీజు తీసుకుని వజ్రాల కోసం తవ్వకాలు ప్రారంభించారు. దాదాపు రెండు నెలల పాటు కష్టపడి పనిచేసిన తర్వాత సోమవారం ప్రైవేట్ భూమిలో ఉన్న గనిలో 11.19 క్యారెట్ల జెమ్ క్వాలిటీ వజ్రాన్ని గుర్తించారు. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వజ్రం లభించగానే కుటుంబ సభ్యులు దానిని ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలో అప్పగించారు. పన్నా డైమండ్ ఇన్స్పెక్టర్ నూతన్ జైన్ మాట్లాడుతూ, ఇది 11.19 క్యారెట్ల నాణ్యమైన వజ్రమని తెలిపారు. త్వరలో జరిగే ప్రభుత్వ వేలంలో దీనిని విక్రయిస్తామని, రాయల్టీ మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు.

ఈ కుటుంబానికి ఇది రెండోసారి లభించిన అదృష్టం. 2024లో ఇదే కుటుంబం 19.22 క్యారెట్ల వజ్రాన్ని గుర్తించింది. ఆ వజ్రం ప్రభుత్వ వేలంలో రూ.93 లక్షలకు అమ్ముడైంది. ఆ డబ్బుతో కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడిందని రాకేష్ సోదరుడు రాజు ఆదివాసీ తెలిపారు. అయినప్పటికీ తాము కష్టపడటం ఆపలేదని, మళ్లీ గనుల్లోనే శ్రమించి ఈ అరుదైన వజ్రాన్ని కనుగొన్నామని చెప్పారు.

రాకేష్ ఆదివాసీ మాట్లాడుతూ, ఈసారి వేలం ద్వారా వచ్చే డబ్బును కొత్త గనుల తవ్వకాల్లో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇంకా మంచి వజ్రాలు దొరికే అవకాశం ఉందనే ఆశతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా వజ్రాల నిల్వలకు పేరుగాంచిన పన్నా జిల్లాలో అప్పుడప్పుడూ ఇలాంటి అరుదైన వజ్రాలు లభిస్తూ ఉంటాయి. అలాంటి అదృష్టం కొందరు కార్మికులు, రైతుల జీవితాలను ఒక్కసారిగా మార్చేస్తుంది. ఇప్పుడు ఈ గిరిజన కుటుంబం వరుసగా రెండోసారి వజ్రాన్ని గుర్తించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

Be the first to react

Latest