⚡ BREAKING

Renewable Energy 2026: ఇన్కాయిస్ (INCOIS) సంచలన నివేదిక... ఒక్క ఏడాది సముద్ర విద్యుత్‌తో 575 ఏళ్ల కరెంటు కష్టాలకు చెక్!

Renewable Energy 2026: హైదరాబాద్ కు చెందిన 'ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్' (INCOIS) శాస్త్రవేత్తలు మన దేశ సముద్ర జలాల నుండి ఏడాదికి 9.2 లక్షల టెరావాట్ల (TWh) విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని లెక్కగట్టారు. ఈ అపారమైన శక్తి యావత్ భారతదేశానికి సుమారు 575 సంవత్సరాల పాటు నిరంతరాయంగా కరెంటు అందించడానికి సరిపోతుంది. సముద్రపు అలలు, పోటు-పాటులు మరియు ఉష్ణోగ్రత వ్యత్యాసాల ద్వారా లభించే ఈ బ్లూ ఎనర్జీని వినియోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అండమాన్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. రాబోయే 2-3 ఏళ్లలో దీని ద్వారా కరెంటు ఉత్పత్తి కానుంది.

ఇన్కాయిస్ (INCOIS) సంచలన నివేదిక
ఇన్కాయిస్ (INCOIS) సంచలన నివేదిక
  • బొగ్గు, కరెంట్ కోతలకు శాశ్వత పరిష్కారం.. సముద్రపు అలల శక్తినే ‘అక్షయపాత్ర’గా మార్చనున్న భారత్

  • 2-3 ఏళ్లలో సముద్రం నుండి కరెంటు సరఫరా.. ఇన్కాయిస్ డైరెక్టర్ బాలకృష్ణన్ నాయర్ వెల్లడి

  • కాలుష్యం లేదు, భూసేకరణ తిప్పలు లేవు.. క్లీన్ ఎనర్జీ రేసులో సరికొత్త రికార్డు సృష్టించనున్న ఏపీ తీరం

Renewable Energy 2026: భారతదేశంలో నానాటికీ పెరిగిపోతున్న విద్యుత్ అవసరాలకు సముద్రాలే శాశ్వత పరిష్కారంగా మారనున్నాయని హైదరాబాద్ కు చెందిన 'ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్' (INCOIS - ఇన్కాయిస్) శాస్త్రవేత్తలు సంచలన విషయాలను వెల్లడించారు. మన దేశానికి అందుబాటులో ఉన్న సముద్ర జలాల (బ్లూ ఎనర్జీ) శక్తిని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టగలిగితే, ఒక్క సంవత్సరంలోనే యావత్ దేశానికి 575 సంవత్సరాల పాటు కోతల్లేకుండా సరిపోయే అపారమైన కరెంటును ఉత్పత్తి చేయవచ్చని సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇన్కాయిస్ డైరెక్టర్ టి. శ్రీనివాస కుమార్ మరియు గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ టి.ఎం. బాలకృష్ణన్ నాయర్ సమగ్ర వివరాలను పంచుకున్నారు.

ఇన్కాయిస్ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, భారత దేశ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) పరిధిలోని అరేబియా సముద్రం, బంగాళాఖాతం జలాల నుండి ఏడాదికి ఏకంగా 9.2 లక్షల టెరావాట్ల (TWh) విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఒక టెరావాట్ అంటే 10 లక్షల మెగావాట్లతో సమానం. ప్రస్తుతం భారతదేశం తన మొత్తం విద్యుత్ అవసరాల కోసం (దాదాపు 4.5 లక్షల మెగావాట్లు) బొగ్గు, నీరు, గాలి, సౌర మరియు అణుశక్తి వంటి అన్ని వనరులపై ఆధారపడి తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇలాంటి తరుణంలో సముద్ర గర్భంలో దాగున్న ఈ 'అక్షయపాత్ర' గ్లోబల్ ఎనర్జీ సంక్షోభానికి చెక్ పెట్టగలదని నివేదిక స్పష్టం చేసింది.

ఈ సముద్ర విద్యుత్ కేవలం ఒకే రకంగా కాకుండా సముద్రపు అలలు (Wave Energy), పోటు-పాటుల ఉప్పెన (Tidal Energy), సముద్ర ఉపరితల-గర్భ ఉష్ణోగ్రతల వ్యత్యాసం (Ocean Thermal Energy Conversion), మరియు ఉప్పు నీరు-మంచినీరు కలిసే చోట ఏర్పడే లవణీయత వ్యత్యాసాల (Salinity Gradient) ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం ఈ సాంకేతికతకు అయ్యే ప్రాథమిక వ్యయం కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, భూసేకరణ సమస్యలు, పర్యావరణ కాలుష్యం మరియు వ్యర్థాల విడుదల వంటి ఇబ్బందులు ఏవీ లేకపోవడం దీని యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్.

భారతదేశం ఇప్పటికే ఈ బ్లూ ఎనర్జీని క్షేత్రస్థాయిలో వినియోగించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో ఒక ప్రత్యేక పైలట్ ప్రాజెక్టును కూడా చేపట్టారు. రాబోయే 2 నుండి 3 సంవత్సరాల కాలంలోనే సముద్ర జలాల నుండి వాణిజ్యపరమైన విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ దేశాలు ఈ విధానంలో ముందడుగు వేయగా, మన దేశంలో కూడా పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగానికి చెందిన పలు దిగ్గజ కంపెనీలు ఈ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి.

ఈ అపారమైన సముద్ర శక్తిని వినియోగించుకునే క్రమంలో తీరప్రాంత భద్రతపై కూడా నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న రాష్ట్రాలలో వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరగడం, తీవ్ర తుపాన్లు రావడం వంటి ముప్పులు పొంచి ఉన్నాయి. కాబట్టి అత్యాధునిక హంగులతో కూడిన భద్రతా ప్రమాణాలను మరియు వినూత్న టెక్నాలజీని ఉపయోగించి, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఈ మెగా ఓషన్ ఎనర్జీ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని ఇన్కాయిస్ వెల్లడించిన 'ఓషన్ ఎనర్జీ అట్లాస్' నివేదిక స్పష్టం చేస్తోంది.

Tags

Be the first to react

Latest