ఢిల్లీలో కొత్త ఈవీ పాలసీకి ఆమోదం.. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి రూ.15 వేల కోట్ల ప్రణాళిక!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కీలక అడుగు పడింది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచే లక్ష్యంతో ఢిల్లీ క్యాబినెట్ కొత్త ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా నగరాన్ని దశలవారీగా కాలుష్య రహిత రవాణా వ్యవస్థ వైపు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Delhi EV Policy
Delhi EV Policy

కాలుష్య రహిత ఢిల్లీ లక్ష్యంగా అడుగులు.. ఈవీ విధానానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..

రూ.30 లక్షల వరకు ఈవీ కార్లకు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ మినహాయింపు..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కీలక అడుగు పడింది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచే లక్ష్యంతో ఢిల్లీ క్యాబినెట్ కొత్త ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా నగరాన్ని దశలవారీగా కాలుష్య రహిత రవాణా వ్యవస్థ వైపు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త ఈవీ విధానం ప్రకారం రూ.30 లక్షల వరకు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. అలాగే పాత వాహనాలను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.1 లక్ష వరకు ప్రోత్సాహకాన్ని అందించనున్నారు.

ఈ విధానం వచ్చే జూలై 1 నుంచి నాలుగేళ్ల పాటు దశలవారీగా అమలు చేయనున్నారు. 2030 మార్చి 31 నాటికి ఢిల్లీలో సున్నా ఉద్గారాల రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రణాళికను రూపొందించింది.

ఈవీ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు 2028 ఏప్రిల్ నుంచి ఢిల్లీలో కొత్తగా రిజిస్టర్ అయ్యే ద్విచక్ర వాహనాలు కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండేలా నిబంధనలు తీసుకురానున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ.. ఈ విధానం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపైనే దృష్టి సారిస్తుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.

ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించనుంది. ఈవీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్ ట్యాక్స్ మినహాయింపుల కోసం సుమారు రూ.8 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక రూపొందించారు. మొత్తంగా ప్రజలకు ఈ విధానం ద్వారా దాదాపు రూ.15 వేల కోట్ల మేర ప్రయోజనం అందుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

చార్జింగ్ స్టేషన్లు, ఈవీ మౌలిక వసతుల అభివృద్ధితో పాటు కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు ఈ విధానం తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. ఢిల్లీని స్వచ్ఛమైన, హరిత రవాణా నగరంగా మార్చేందుకు ఈ కొత్త విధానం కీలకంగా మారనుంది.

Tags

Be the first to react

Latest