Vijaya Mehta: భారత కళారంగానికి తీరని లోటు.. విజయ మెహతా మృతి!

Vijaya Mehta: ప్రముఖ చలనచిత్ర, నాటకరంగ దిగ్గజం విజయ మెహతా కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ నాటక, సినీ రంగం ఒక గొప్ప కళాకారిణిని కోల్పోయింది.

Vijaya Mehta
Vijaya Mehta

ప్రముఖ సినీ, నాటకరంగ ప్రముఖురాలు విజయ మెహతా ఇకలేరు..

నాటక రంగానికి మార్గదర్శకురాలు విజయ మెహతాకు కళారంగం నివాళి..

ప్రముఖ చలనచిత్ర, నాటకరంగ దిగ్గజం విజయ మెహతా కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ నాటక, సినీ రంగం ఒక గొప్ప కళాకారిణిని కోల్పోయింది. ముఖ్యంగా ప్రయోగాత్మక మరాఠీ నాటక రంగానికి కొత్త దిశ చూపిన వ్యక్తిగా విజయ మెహతా చిరస్థాయిగా గుర్తుండిపోతారు.

మరాఠీ నాటక రంగంలో 'రంగాయణ్' అనే నాటక బృందం ద్వారా విజయ మెహతా కొత్త తరహా రంగస్థల భాషను, ఆధునిక ఆలోచనలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ప్రపంచ నాటక రంగంలోని పద్ధతులను మరాఠీ రంగస్థలంతో మేళవించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దర్శకత్వంలో వచ్చిన 'బారిస్టర్', 'సఖారామ్ బైండర్', 'హమీదాబాయిచి కోఠి', 'మహానిర్వాణ్', 'పురుష్', 'హయవదన', 'వాడా చిరేబంది' వంటి నాటకాలు మరాఠీ నాటక చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి.

రంగస్థలంతో పాటు సినీ, టెలివిజన్ రంగాల్లోనూ విజయ మెహతా విశేష సేవలు అందించారు. 'రావ్ సాహెబ్', 'పెస్టోంజీ', 'శకుంతలం' వంటి చిత్రాలు, 'స్మృతిచిత్రే' టెలివిజన్ సీరీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గురువుగా, మార్గదర్శకురాలిగా కూడా ఆమె అనేక తరాల నటులు, దర్శకులు, నాటక కళాకారులను తీర్చిదిద్దారు.

కళారంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను విజయ మెహతాకు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. 1975లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకోగా, 1986లో 'రావ్ సాహెబ్' చిత్రంలో ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. వీటితో పాటు మరెన్నో గౌరవాలు ఆమెను వరించాయి.

విజయ మెహతా మరణంపై సినీ, నాటక రంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణం భారతీయ కళారంగానికి తీరని లోటని పలువురు నివాళులు అర్పిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా విజయ మెహతా మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులో ఆధునిక మరాఠీ నాటక రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. సృజనాత్మకత, కళాపట్ల ఆమెకు ఉన్న అంకితభావం ఎన్నో తరాల నటులు, దర్శకులు, నాటక ప్రేమికులకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, కళారంగానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tags

Be the first to react

Latest