జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు తొలగింపు.. సాధారణ స్థితికి చేరుకున్న ఇంధన సరఫరా పరిస్థితులు!
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు, పంపిణీపై విధించిన తాత్కాలిక నియంత్రణలను కేంద్ర ప్రభుత్వం తొలగించాలని నిర్ణయించింది. జూలై 1, 2026 నుంచి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, హై స్పీడ్ డీజిల్ విక్రయాలు సాధారణంగా కొనసాగనున్నాయి.
వినియోగదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో మళ్లీ సాధారణ విధానం..
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో తీసుకున్న ఆంక్షలకు ముగింపు..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు, పంపిణీపై విధించిన తాత్కాలిక నియంత్రణలను కేంద్ర ప్రభుత్వం తొలగించాలని నిర్ణయించింది. జూలై 1, 2026 నుంచి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, హై స్పీడ్ డీజిల్ విక్రయాలు సాధారణంగా కొనసాగనున్నాయి.
పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ దేశీయ వినియోగదారులపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను స్థిరంగా కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అయితే రిటైల్ ధరలు, భారీగా కొనుగోలు చేసే వినియోగదారుల ధరల మధ్య వ్యత్యాసం పెరగడంతో తాత్కాలిక నియంత్రణ చర్యలను ప్రభుత్వం అమలు చేసింది. ఈ నెల 12న తీసుకొచ్చిన ఈ నిబంధనల ప్రకారం.. పెట్రోల్ బంకుల్లో ఒక్కో వినియోగదారు లేదా వాహనానికి రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల హై స్పీడ్ డీజిల్ మాత్రమే అందించేలా పరిమితి విధించారు.
అదే సమయంలో పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ఇంధనం పొందేలా చర్యలు తీసుకున్నారు. డీజిల్ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, దారి మళ్లింపులను అరికట్టడం, సాధారణ వినియోగదారులకు ఇంధనం నిరంతరంగా అందుబాటులో ఉంచడమే ఈ చర్యల ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితిని సమీక్షించిన అనంతరం.. ఈ తాత్కాలిక ఆంక్షలు ఇక అవసరం లేదని కేంద్రం నిర్ణయించింది. సరఫరా వ్యవస్థ మెరుగుపడటం, సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడంతో నియంత్రణలను తొలగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాత్కాలిక చర్యల వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అందుబాటు కొనసాగడంతో పాటు రిటైల్ వినియోగదారుల ప్రయోజనాలు రక్షించబడ్డాయని కేంద్రం తెలిపింది. జూలై 1 నుంచి సాధారణ సరఫరా విధానం కొనసాగనుంది.