IRCTC: భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు.. సికింద్రాబాద్ నుంచి రెండు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రలు!
IRCTC: ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులకు ఐఆర్సీటీసీ (IRCTC) శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి రెండు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్యాకేజీలను ప్రకటించింది.
అయోధ్య–కాశీ, దివ్య దక్షిణ యాత్రలకు ఐఆర్సీటీసీ ప్రత్యేక రైళ్లు..
జూలైలో రెండు ఆధ్యాత్మిక యాత్రలు.. సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ రైళ్లు..
ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులకు ఐఆర్సీటీసీ (IRCTC) శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి రెండు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్యాకేజీలను ప్రకటించింది. ఉత్తర భారతంలోని పవిత్ర క్షేత్రాలతో పాటు దక్షిణ భారత ప్రముఖ దేవాలయాలను దర్శించేలా ఈ యాత్రలను రూపొందించింది.
మొదటి ప్యాకేజీ ‘అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్’ పేరుతో జూలై 4న మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ యాత్ర మొత్తం 9 రాత్రులు – 10 రోజుల పాటు కొనసాగుతుంది.
ఈ యాత్రలో విష్ణుపాద్ ఆలయం, కాశీ విశ్వనాథ్ ఆలయం, కాశీ విశాలాక్షి ఆలయం, అన్నపూర్ణాదేవి ఆలయం, గంగా హారతి, అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హి, త్రివేణి సంగమం, బాబా బైద్యనాథ్ ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పించారు.
ఈ రైలుకు తెలంగాణలో సికింద్రాబాద్, చెర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం స్టేషన్లలో, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో ఎక్కే, దిగే సౌకర్యం కల్పించారు.
రెండో ప్యాకేజీ ‘దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం’ పేరుతో జూలై 20న ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్ర 8 రాత్రులు – 9 రోజుల పాటు కొనసాగుతుంది.
ఈ పర్యటనలో అరుణాచలేశ్వర ఆలయం, నటరాజ ఆలయం, శ్రీరంగనాథస్వామి ఆలయం, బృహదీశ్వర ఆలయం, రామనాథస్వామి ఆలయం, మీనాక్షి అమ్మన్ ఆలయం, వివేకానంద రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయం వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించే అవకాశం ఉంటుంది.
ఈ యాత్రకు తెలంగాణలో సికింద్రాబాద్, చెర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో, ఆంధ్రప్రదేశ్లో మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఎక్కే, దిగే సదుపాయం ఏర్పాటు చేశారు.
ఈ రెండు టూర్ ప్యాకేజీల్లో ప్రయాణికులకు ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటి శాకాహార భోజన సదుపాయం, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రొఫెషనల్ టూర్ ఎస్కార్ట్ సేవలు, అలాగే రైలులో భద్రతా ఏర్పాట్లు కూడా కల్పించనున్నారు. ఈ యాత్రలపై పూర్తి వివరాలు, టికెట్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఐఆర్సీటీసీ సూచించింది.
Be the first to react