ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి సంబంధించి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండటం చాలా అవసరం. తాజా అధ్యయనాల ప్రకారం, బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి ట్రీ నట్స్ను పరిమిత మోతాదులో తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
బాదం వంటి ట్రీ నట్స్‌లో మోనో అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి హానికరమైన ఎల్డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అదే సమయంలో శరీరానికి మేలు చేసే హెచ్డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
రోజుకు కొద్దిగా బాదం లేదా ఇతర నట్స్ తీసుకునే వారిలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తక్కువగా కనిపించింది. ముఖ్యంగా షుగర్, అధిక రక్తపోటు ఉన్నవారికి ఈ ట్రీ నట్స్ మంచి ఆహార ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.
ట్రీ నట్స్ ఆరోగ్యకరమైనవే అయినా అతిగా తీసుకోవడం మంచిది కాదు. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉండటంతో బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే రోజుకు ఒక చిన్న ముట్ట (హ్యాండ్‌ఫుల్) మాత్రమే తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు లేదా చక్కెర కలిపిన నట్స్ కంటే నేచురల్ నట్స్‌నే ఎంచుకోవడం మంచిది.
సమతుల ఆహారం, వ్యాయామంతో పాటు బాదం, ఇతర ట్రీ నట్స్‌ను సరైన మోతాదులో తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అయితే ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకే ఆహార మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.