ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తుల సౌకర్యం, ఆలయాల నిర్వహణలో పారదర్శకత పెంచే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తోంది. ఈ క్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దర్శన టిక్కెట్లు, ఆర్జిత సేవలు, వసతి, ప్రసాదాలు, విరాళాలు వంటి అన్ని సేవలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇకపై భక్తులు దర్శన టిక్కెట్లతో పాటు ప్రత్యక్ష–పరోక్ష ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్, కేశఖండన సేవలు, ప్రసాదాల కొనుగోలు, విరాళాల చెల్లింపులు అన్నింటినీ డిజిటల్ పేమెంట్ల ద్వారానే చేయాల్సి ఉంటుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
భక్తుల సౌలభ్యం కోసం దుర్గమ్మ ఆలయ టిక్కెట్ బుకింగ్‌కు పలు డిజిటల్ మార్గాలను అందుబాటులో ఉంచారు. www.kanakadurgamma.org, www.aptemples.ap.gov.in అనే రెండు వెబ్‌సైట్లు, కనకదుర్గమ్మ మొబైల్ యాప్, అలాగే మనమిత్ర వాట్సప్ సేవ (9552300009) ద్వారా ముందుగానే దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల భక్తులు క్యూ లైన్లలో నిలబడే అవసరం తగ్గుతుంది.
ఆన్‌లైన్ సేవలు ప్రారంభమైన తర్వాత టిక్కెట్ల విక్రయాల్లో అక్రమాలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. అన్ని డిజిటల్ పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో భక్తులు సులభంగా చెల్లింపులు చేయగలుగుతున్నారు. ఈ మార్పుల వల్ల ఆలయ నిర్వహణ మరింత సజావుగా సాగుతుందని భావిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, కాణిపాకం వంటి ప్రధాన ఆలయాల్లో కూడా ఇదే విధమైన ఆన్‌లైన్ సేవలు అమలులో ఉన్నాయి. ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆలయాలకు ర్యాంకుల విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇటీవల ప్రకటించిన ర్యాంకుల్లో శ్రీశైలం ఆలయం మొదటి స్థానంలో నిలవగా, విజయవాడ దుర్గగుడి రెండో స్థానంలో నిలిచింది. భక్తులు ఈ డిజిటల్ విధానాన్ని వినియోగించుకుని సౌకర్యవంతంగా దర్శనం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.