ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 10.42 లక్షల మంది అర్హులు దరఖాస్తు చేసుకోగా, వీటికి వచ్చే ఫిబ్రవరి నెలలో మంజూరు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 2029 నాటికి ప్రతి అర్హుడికి ఇల్లు, నివాస స్థలం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ వివరాలను వెల్లడించారు. పీఎంఏవై పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారునికి కేంద్ర ప్రభుత్వం రూ.1.59 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో గృహ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని పేర్కొన్నారు.
2024 ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 3.10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, మరో 5.68 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని అధికారులు వివరించారు. కొన్ని జిల్లాల్లో పనులు వేగంగా సాగుతున్నప్పటికీ, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని గుర్తించారు.
ఈ పరిస్థితిపై స్పందించిన సీఎం చంద్రబాబు, వచ్చే ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని సూచించారు. జిల్లాల వారీగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.
పేదలందరికీ సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం కేటాయించనున్నారు. దూర ప్రాంతాల్లో స్థలాలు పొందినవారికి అవసరమైతే నివాసయోగ్య ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వనున్నారు. అధిక ధరలున్న పట్టణ ప్రాంతాల్లో జీ+3 భవనాల నిర్మాణం చేపట్టే ఆలోచన కూడా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ఐదేళ్లలో ప్రతి అర్హ పేదవాడికి ఇల్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.