ఏపీ ప్రభుత్వం రేషన్ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రజలకు అనుకూలంగా మార్చే దిశగా కీలక సంస్కరణలు చేపట్టింది. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసిన విధానాన్ని రద్దు చేసి, మళ్లీ పాత తరహా రేషన్ డీలర్ల వ్యవస్థను అమలు చేస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా 15 రోజుల పాటు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు, రాగులు, జొన్నలు, పామాయిల్, చక్కెర వంటి సరుకులు అందించడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. రేషన్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టింది. క్యూఆర్ కోడ్ ఉన్న ఈ కార్డుల ద్వారా లబ్ధిదారుల వివరాలు సులభంగా గుర్తించడంతో పాటు మోసాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటోంది.
ఇక తాజాగా రేషన్ దుకాణాల్లో పారదర్శకత మరింత పెంచేందుకు ప్రతి షాప్ వద్ద క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేస్తోంది. ఈ బోర్డులపై డీలర్ పేరు, రేషన్ షాప్ నంబర్, గ్రామం/వార్డు, మండలం వంటి పూర్తి వివరాలను ముద్రిస్తోంది. దీని ద్వారా రేషన్ కార్డుదారులకు స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంటుంది.
రేషన్ దుకాణాల్లో తూకాల్లో తేడాలు, సరుకులు పూర్తిగా ఇవ్వకపోవడం, అధిక ధరలు వసూలు చేయడం వంటి అక్రమాలు జరిగితే, లబ్ధిదారులు వెంటనే ఈ క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నేరుగా అధికారుల దృష్టికి వెళ్లడంతో త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
అంతేకాదు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ప్రభుత్వం లబ్ధిదారుల అభిప్రాయాలను కూడా సేకరిస్తోంది. సరుకుల నాణ్యత, డీలర్ ప్రవర్తన, సరైన తూకం వంటి అంశాలపై ప్రశ్నలకు అవును/కాదు అని సమాధానాలు ఇవ్వాలి. చివరగా ఓటీపీ ఎంటర్ చేస్తే ఫీడ్‌బ్యాక్ అధికారులకు చేరుతుంది. ఈ విధానం ద్వారా ప్రజల అసంతృప్తి తగ్గించి, రేషన్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.