Pawan Kalyan: రూ.1.5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం.. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అరెస్ట్.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!
Pawan Kalyan: రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. స్మగ్లింగ్ ముఠాలకు సహకరించే వారెవరైనా చట్టం ముందు తప్పించుకోలేరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు మరింత పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. 'ఆపరేషన్ అరణ్య'పై పవన్ కళ్యాణ్ సమీక్ష..
కడప: రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. స్మగ్లింగ్ ముఠాలకు సహకరించే వారెవరైనా చట్టం ముందు తప్పించుకోలేరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు మరింత పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు.
కడప జిల్లా అవధూత కాశినాయన మండలం వరికుంట్ల గ్రామ సమీపంలోని జ్యోతి గుడి వద్ద రూ.1.5 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై శనివారం ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దర్యాప్తు పురోగతిని అడిగి తెలుసుకుని కీలక ఆదేశాలు జారీ చేశారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, స్టేట్ ఇంటెలిజెన్స్ బృందానికి అందిన విశ్వసనీయ సమాచారంతో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం వరికుంట్ల గ్రామ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఇంటి సామగ్రి ముసుగులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న బొలెరో మ్యాక్స్ వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేశారు.
వాహనంలో రూ.1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో హర్యానాకు చెందిన సన్నీ, రమేష్ అనే ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
విచారణలో జ్యోతి ఫారెస్ట్ బీట్ పరిధిలో పనిచేస్తున్న బీట్ ఆఫీసర్ మల్లికార్జునుడు స్మగ్లింగ్ ముఠాలకు సహకరిస్తున్నట్లు బయటపడింది. వెంటనే అతడిని కూడా అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో బీట్ ఆఫీసర్ పాత్రపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రాథమిక విచారణలో బెంగళూరు, హర్యానా, కోల్‌కతా ప్రాంతాలకు చెందిన మరికొందరు కీలక స్మగ్లింగ్ సూత్రధారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారిని త్వరితగతిన అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించి, స్మగ్లింగ్ గొలుసును పూర్తిగా తెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ అరణ్య' ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు జరుగుతున్న చర్యలను తాను స్వయంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. అడవుల సంపదను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్నా చట్టం ముందు అందరూ సమానమేనని, అక్రమాలకు పాల్పడేవారితో పాటు వారికి సహకరించే అధికారులపైనా రాజీపడకుండా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
Tags
Be the first to react