TTD Update: ఆదివారం తిరుమలకు వెళ్తున్నారా? భక్తులకు ఉచిత సేవలు - ఒక్కరోజే 78 వేల మందికి.. టీటీడీ కీలక విజ్ఞప్తి!
TTD Update: తిరుమల కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వారాంతం కావడంతో... శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరాగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి.
- తిరుమల కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ..
- ఒక్కరోజే రూ. 4.98 కోట్ల హుండీ ఆదాయం..
TTD Update: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల కొండపై భక్తుల రద్దీ తీవ్రరూపం దాల్చింది. వారాంతపు సెలవులు రావడంతో ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్యూలైన్లు వెలుపలికి వచ్చి కిలోమీటర్ల మేర శిలాతోరణం వరకు విస్తరించాయి. టైమ్ స్లాట్ టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (SSD) దక్కడానికి సుమారు 20 నుండి 24 గంటల సుదీర్ఘ సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.
గడిచిన శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 78,721 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.98 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ ప్రకటనలో తెలిపింది. అలాగే, 38,018 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రద్దీకి అనుగుణంగా ప్రసాదాల కొరత రాకుండా చూసిన టీటీడీ, ఒక్కరోజే 4.37 లక్షల లడ్డూలను విక్రయించింది.
మరోవైపు కొండపైకి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్త్రుత ఏర్పాట్లు చేసింది. మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా పాలు, ఉచిత అన్నప్రసాద వితరణ చేపట్టారు. నిన్న ఒక్కరోజే 2.87 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. క్యూలైన్లలో సుదీర్ఘ సమయం వేచి ఉండటం వల్ల స్వల్ప అస్వస్థతకు గురైన 3,682 మంది భక్తులకు టీటీడీ ప్రాథమిక వైద్య కేంద్రాల ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించారు.
ఆదివారం కూడా సెలవు దినం కావడంతో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో ఉండే చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ భారీ రద్దీని, వేచి ఉండే సమయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ తిరుమల యాత్రను ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
Tags
Be the first to react