Vangalapudi Anitha: కోటవురట్లలో హోంమంత్రి అనిత పర్యటన.. విద్యాభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి!

Vangalapudi Anitha: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పిల్లల చదువుతో పాటు వారి ప్రవర్తన, భవిష్యత్తుపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ చూపాలని ఆమె సూచించారు.

Home Minister Vangalapudi Anitha
Home Minister Vangalapudi Anitha

రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో మెగా పేరెంట్–టీచర్స్ సమావేశాలు: మంత్రి అనిత..

ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం: హోంమంత్రి అనిత..

కోటవురట్ల: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పిల్లల చదువుతో పాటు వారి ప్రవర్తన, భవిష్యత్తుపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ చూపాలని ఆమె సూచించారు.

శుక్రవారం పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటవురట్ల మండలంలో పర్యటించిన హోంమంత్రి అనిత పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ హైస్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు.

పర్యటనలో భాగంగా సమగ్ర శిక్షా నిధులతో రూ.168.03 లక్షల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) నూతన భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు. అలాగే రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన ట్రెజరీ కార్యాలయం కొత్త భవనాన్ని కూడా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం అనంతరం హోంమంత్రి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారి చదువు, ఆశయాలు, పాఠశాల సౌకర్యాల గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రి రాక సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు.

పాఠశాల వద్ద బస్సు స్టాండ్ ఏర్పాటు చేయడంతో పాటు అడ్డురోడ్డు నుంచి నర్సీపట్నం వరకు రెండు కొత్త బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థుల రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని మంత్రి అనిత తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యకు సంబంధం లేని ఇతర కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. గుడిని ఎంత పవిత్రంగా భావిస్తామో, బడిని కూడా అదే గౌరవంతో చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు.

పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. 'తల్లికి వందనం' వంటి సంక్షేమ పథకాల ద్వారా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యారంగాన్ని బలోపేతం చేసిందన్నారు.

పాయకరావుపేట నియోజకవర్గంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కానుండటంతో వేలాది మంది యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. విద్యార్థులు బాధ్యతగా చదువుకోవాలని, మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

తల్లిదండ్రులు పిల్లలను జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దాలని, అదే సమయంలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హోంమంత్రి సూచించారు. విద్య, మౌలిక వసతులు, విద్యార్థుల భద్రత, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై ప్రభుత్వం సమగ్ర దృష్టితో పనిచేస్తోందని ఆమె మరోసారి స్పష్టం చేశారు.

Tags

Be the first to react

Latest