Atchennaidu: జూలై 5 నుంచి 261 టన్నుల టమాటా కొనుగోలు.. రైతులకు అండగా ప్రభుత్వం!
Atchennaidu: రాష్ట్రంలో టమాటా ధరలపై వాస్తవాలను పక్కనబెట్టి తప్పుడు ప్రచారం చేయడం రైతులకు మేలు చేయదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా, మార్కెట్ పరిస్థితులను సరిగా అర్థం చేసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు.
టమాటాకు కిలో రూ.2 మాత్రమే వస్తోందన్న ప్రచారం అవాస్తవం: అచ్చెన్నాయుడు..
రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం.. టమాటా మార్కెట్‌పై నిరంతర సమీక్ష..
అమరావతి: రాష్ట్రంలో టమాటా ధరలపై వాస్తవాలను పక్కనబెట్టి తప్పుడు ప్రచారం చేయడం రైతులకు మేలు చేయదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా, మార్కెట్ పరిస్థితులను సరిగా అర్థం చేసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు.
మంత్రి శనివారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా టమాటా రైతులకు కిలోకు కేవలం రూ.2 మాత్రమే లభిస్తోందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టమాటా సగటు ధర కిలోకు రూ.10.55గా ఉందన్నారు. అన్నమయ్య జిల్లాలో సగటు ధర రూ.10.58, మదనపల్లె మార్కెట్‌లో రూ.11 నమోదైందని తెలిపారు. నిన్నటి మార్కెట్ లావాదేవీల ప్రకారం రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో టమాటా ధరలు కిలోకు రూ.6 నుంచి రూ.16 వరకు పలికాయని వివరించారు.
రైతులకు గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులను సమీక్షిస్తోందని అచ్చెన్నాయుడు చెప్పారు. వ్యవసాయ మార్కెటింగ్, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, అవసరమైన జోక్య చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
ఈ ఏడాది టమాటా దిగుబడి అధికంగా రావడంతో మార్కెట్లకు సరుకు రాక పెరిగినప్పటికీ, ముందస్తు ప్రణాళికతో సాగు విస్తీర్ణాన్ని దశలవారీగా నియంత్రించడం, విడతల వారీగా నాట్లు వేయించడం వంటి చర్యల ద్వారా ఒకేసారి అధిక సరఫరా ఏర్పడకుండా ప్రభుత్వం కృషి చేసిందన్నారు.
జూలై నెలలో రాష్ట్రంలోని మార్కెట్లకు రోజుకు సగటున 5,000 నుంచి 5,500 మెట్రిక్ టన్నుల టమాటా వస్తోందని మంత్రి తెలిపారు. నిన్న మాత్రం 6,000 నుంచి 7,000 మెట్రిక్ టన్నుల వరకు రాకలు నమోదయ్యాయని చెప్పారు. కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నట్లుగా 12,225 మెట్రిక్ టన్నుల టమాటా రాప్తాడు మార్కెట్‌కు వచ్చిందన్న వార్త పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. వాస్తవానికి రాప్తాడు మార్కెట్‌లో టమాటా రాకలే నమోదు కాలేదని పేర్కొన్నారు.
గత రెండేళ్లుగా టమాటా ధరలు మొత్తం సీజన్‌లో రూ.3 నుంచి రూ.6 మధ్యే ఉన్నాయని ప్రచారం చేయడం కూడా నిజం కాదని మంత్రి అన్నారు. 2024, 2025 సంవత్సరాల్లో అనేక నెలల్లో టమాటా ధరలు ఈ స్థాయిని మించి నమోదయ్యాయని గుర్తు చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేయడం రైతులను అయోమయానికి గురిచేస్తుందని వ్యాఖ్యానించారు.
రైతులకు మద్దతుగా ప్రభుత్వం మార్కెట్ జోక్య కార్యక్రమాలు కొనసాగిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా జూలై 5 నుంచి ఇప్పటివరకు 261 టన్నుల టమాటాను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ టమాటాలను రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో 'నో లాస్ – నో ప్రాఫిట్' విధానంలో వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు వివరించారు. దీనివల్ల రైతులకు మార్కెట్‌లో ఉపశమనం కలగడంతో పాటు వినియోగదారులకు కూడా అందుబాటు ధరలో టమాటా లభిస్తోందన్నారు.
రైతుల కష్టాలను రాజకీయ ప్రచారానికి ఉపయోగించకుండా, వారి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా అందరూ ఆలోచించాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నిరాధార ప్రచారాలను నమ్మి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యాన శాఖ, మార్కెటింగ్ శాఖలు మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మార్కెట్‌లో పరిస్థితులు ఎలా ఉన్నా రైతుకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Tags
Be the first to react