Minister Savitha: చదువు పూర్తికాగానే ఉద్యోగాలే లక్ష్యం.. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల విస్తరణ.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు!

Minister Savitha: విద్య పూర్తయ్యే సరికి యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Minister Savitha
Minister Savitha

మెగా పీటీఎంతో విద్యార్థుల ప్రగతికి కొత్త దిశ.. బీసీ గురుకులాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి..

విలువలతో కూడిన విద్యే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత..

నర్సాపురం: విద్య పూర్తయ్యే సరికి యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

నర్సాపురం నియోజకవర్గంలోని స్టేషన్‌పేట మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్‌తో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి సవిత పేర్కొన్నారు. విద్యార్థులు చదువు మధ్యలో మానేయకుండా ఉండేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మెగా పీటీఎం ద్వారా విద్యార్థుల చదువు, ప్రవర్తన, మానసిక, శారీరక అభివృద్ధిపై తల్లిదండ్రులకు మరింత అవగాహన కలుగుతోందని చెప్పారు.

బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. అన్న ఎన్టీఆర్ గురుకుల విద్యకు శ్రీకారం చుట్టగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అత్యధిక సంఖ్యలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు అయ్యాయని గుర్తుచేశారు.

2014-19 మధ్య కాలంలో 75 బీసీ గురుకులాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, కూటమి పాలనలో రెండేళ్లలోనే మరో 12 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలను ప్రారంభించిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 10 కొత్త బీసీ గురుకులాలను ప్రారంభించగా, ఆరు బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.

గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు వంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించినట్లు వివరించారు. అలాగే 'తల్లికి వందనం', డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు, మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారం వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల చదువుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి సవిత పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిశ్రమలు నెలకొల్పడంతో ఉన్నత విద్య పూర్తిచేసిన యువతకు తమ స్వస్థలాల్లోనే ఉద్యోగాలు లభించే అవకాశాలు పెరుగుతాయని ఆమె తెలిపారు.

అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎంజేపీ గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని మంత్రి అభినందించారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మెగా పీటీఎం కార్యక్రమాల వల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం పెరిగి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.

కార్యక్రమం అనంతరం మంత్రి సవిత విద్యార్థుల తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి ఆరా తీశారు. ప్రభుత్వ సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, ఎంజేపీ పాఠశాలల కార్యదర్శి మాధవీలత, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest