Simhachalam: సింహాచలం గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం.. 6 లక్షల మంది భక్తులకు విస్తృత ఏర్పాట్లు!
Simhachalam: ఉత్తరాంధ్రలో అత్యంత వైభవంగా జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే గిరి ప్రదక్షిణలో ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గిరి ప్రదక్షిణ నిర్వహణ: హోంమంత్రి అనిత..
సింహాచలం గిరి ప్రదక్షిణకు కట్టుదిట్టమైన భద్రత.. సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ..
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో అత్యంత వైభవంగా జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే గిరి ప్రదక్షిణలో ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.
సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణలో భారీగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. భక్తుల సేవ కోసం వివిధ శాఖలకు చెందిన సుమారు 5 వేల మంది ఉద్యోగులు, అధికారులు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు.
ఈ నెల 28న ఉదయం నుంచే భక్తులు తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారని, మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి స్వామివారి రథం బయలుదేరుతుందని తెలిపారు. రద్దీని నియంత్రించేందుకు తొలిపావంచా వద్ద 50 క్యూ లైన్లు, 120 ఇనుప బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
భక్తులకు అవసరమైన సహాయం అందించేందుకు గిరి ప్రదక్షిణ మార్గంలో 28 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ప్రతి కేంద్రంలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, విద్యుత్ వెలుగులు, దిశా సూచికలు, వైద్య సదుపాయాలు, విశ్రాంతి ఏర్పాట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
తొలిపావంచా, అడవివరం, హనుమంతవాక, అప్పుఘర్, మాధవధార, ఎన్‌ఎస్‌టీఎల్ గేట్, పాత గోశాల ప్రాంతాల్లో మొత్తం 7 ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పోలీస్, దేవస్థానం, జీవీఎంసీ, వైద్యశాఖ అధికారులు సంయుక్తంగా సేవలు అందిస్తారని వివరించారు.
గిరి ప్రదక్షిణ మార్గంలో 31 వైద్య శిబిరాలు, 22 అంబులెన్సులు, మొబైల్ వైద్య బృందాలు సిద్ధంగా ఉంటాయని తెలిపారు. కొండపై కూడా అదనపు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
భక్తులకు తాగునీటి కొరత రాకుండా 115 వాటర్ పాయింట్లు, వాటర్ బబుల్స్, ప్యాకేజ్డ్ తాగునీరు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అలాగే మార్గమంతా 595 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న శాశ్వత మరుగుదొడ్లను కూడా వినియోగానికి సిద్ధం చేశామని చెప్పారు.
భక్తుల భద్రత కోసం దిగువ ప్రాంతాల్లో 70 తాత్కాలిక సీసీ కెమెరాలు, కొండపై అదనంగా 45 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు.
భద్రత కోసం 2,700 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని, మొత్తం 5 వేల మంది సిబ్బంది గిరి ప్రదక్షిణ నిర్వహణలో పాల్గొంటారని వెల్లడించారు. అలాగే 40 పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, తగిన లైటింగ్, 192 అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. చిన్నారులు, వృద్ధులు తప్పిపోకుండా ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
గిరి ప్రదక్షిణ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఈ నెల 28 ఉదయం నుంచి 29 మధ్యాహ్నం వరకు సింహాచలం వైపు భారీ వాహనాల రాకపోకలను నియంత్రిస్తామని చెప్పారు.
శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఆనందపురం మీదుగా సబ్బవరం వైపు మళ్లిస్తామని, నగరంలోకి వచ్చే ఇతర వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
అప్పుఘర్, జోడుగుళ్లపాలెం సముద్ర తీరాల్లో స్నానం చేసే భక్తుల భద్రత కోసం మత్స్యశాఖ ఆధ్వర్యంలో 90 మంది నిపుణులైన ఈతగాళ్లను మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంచుతున్నట్లు తెలిపారు. నిరంతరం భద్రతా సూచనలు ప్రసారం చేస్తామని చెప్పారు.
భక్తుల రాకపోకలకు అనుగుణంగా ఈ నెల 28న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. 29న కొండపై నుంచి దిగువకు భక్తులను తరలించేందుకు దేవస్థానం బస్సులతో పాటు 50 ఉచిత ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు.
గిరి ప్రదక్షిణ విజయవంతం కావాలంటే భక్తుల సహకారం ఎంతో అవసరమని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, సముద్ర స్నానం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నారులు, వృద్ధుల విషయంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన గిరి ప్రదక్షిణ అనుభవం కల్పించేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, దేవస్థానం, పోలీస్, జీవీఎంసీతో పాటు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. గిరి ప్రదక్షిణ ప్రభావం దృష్ట్యా గోపాలపట్నం, చినగదిలి, సీతమ్మధార, పెందుర్తి మండలాల పరిధిలో మార్గానికి సమీపంలో ఉన్న 221 పాఠశాలలు, కళాశాలలకు జూలై 28న స్థానిక సెలవు ప్రకటించినట్లు హోంమంత్రి వెల్లడించారు.
Be the first to react