Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు.. ప్రధాని మోదీకి అతిపెద్ద ధింసా నృత్యంతో ఘన స్వాగతం!

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశగా నిలవనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం) ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం జాతికి అంకితం కానున్న నేపథ్యంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం భోగాపురంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Nara Lokesh Reviews Bhogapuram Inauguration Arrangements
Nara Lokesh Reviews Bhogapuram Inauguration Arrangements

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు.. సమీక్షించిన మంత్రి నారా లోకేష్..

ప్రధాని మోదీకి 13 వేల మందితో దేశంలోనే అతిపెద్ద ధింసా నృత్య స్వాగతం..

భోగాపురం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశగా నిలవనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం) ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం జాతికి అంకితం కానున్న నేపథ్యంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం భోగాపురంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రధాని మోదీ పాల్గొనే ప్రారంభోత్సవ సభకు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి సుమారు మూడు లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. ఆ మేరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రధాని నరేంద్ర మోదీకి ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా సుమారు 13 వేల మంది కళాకారులతో దేశంలోనే అతిపెద్ద ధింసా నృత్య ప్రదర్శన నిర్వహించాలని మంత్రి సూచించారు. ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని పేర్కొన్నారు.

సభకు ప్రజలను తరలించేందుకు 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 5 వేల బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు బస్సు ఎక్కిన సమయం నుంచి తిరిగి ఇంటికి చేరే వరకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మండల స్థాయి లైజన్ అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ తాగునీరు, అల్పాహారం, భోజనం వంటి ప్రాథమిక సౌకర్యాలు సమృద్ధిగా అందించాలని కూడా సూచించారు.

ప్రారంభోత్సవ ఏర్పాట్ల కమిటీ ముఖ్య అధికారి ఎం.టి. కృష్ణబాబు మాట్లాడుతూ, సభకు హాజరయ్యే ప్రజలందరికీ కార్యక్రమం స్పష్టంగా కనిపించేలా ప్రతి ఐదు వేల మందికి ఒక ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త అవకాశాలు తీసుకురానుందని, ఈ ప్రారంభోత్సవం రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఏర్పాట్లపై సమీక్షించారు.

Tags

Be the first to react

Latest