Railways: బళ్లారి–గుంతకల్లు రైల్వే మార్గానికి భారీ ఊతం.. రూ.1,264 కోట్లతో అదనంగా రెండు లైన్లు.. కేంద్ర కేబినెట్ ఆమోదం!
Railways: రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు దేశీయ రసాయన పరిశ్రమలను బలోపేతం చేసే రెండు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార, ప్రసారాలు, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ నిర్ణయాలను వెల్లడించారు. బళ్లారి–గుంతకల్లు మధ్య అదనంగా రెండు రైల్వే లైన్ల నిర్మాణంతో పాటు ‘భవ్య రసాయన్’ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.
ఏపీ–కర్ణాటకకు ప్రయోజనం.. బళ్లారి–గుంతకల్లు రైల్వే విస్తరణకు ఆమోదం..
వేదావతి నదిపై మెగా బ్రిడ్జి.. రైల్వే ప్రాజెక్టులో కీలక పనులకు శ్రీకారం..
న్యూఢిల్లీ: రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు దేశీయ రసాయన పరిశ్రమలను బలోపేతం చేసే రెండు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార, ప్రసారాలు, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ నిర్ణయాలను వెల్లడించారు. బళ్లారి–గుంతకల్లు మధ్య అదనంగా రెండు రైల్వే లైన్ల నిర్మాణంతో పాటు ‘భవ్య రసాయన్’ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.
ఆంధ్రప్రదేశ్–కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానించే కీలకమైన బళ్లారి–గుంతకల్లు రైల్వే మార్గంలో మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.1,264 కోట్లు కేటాయించారు. మొత్తం 46 కిలోమీటర్ల పొడవున ఈ అదనపు లైన్లను నిర్మించనున్నారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు సరకు రవాణా సామర్థ్యం కూడా గణనీయంగా పెరగనుంది.
ఈ ప్రాజెక్టు అమలుతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రవాణా మరింత సులభం కానుంది. ముఖ్యంగా పరిశ్రమలు, గనులు అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి సరుకు రవాణా వేగవంతం కావడంతో రెండు రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించనుంది. ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి అదనంగా ఏటా 1.60 కోట్ల టన్నుల సరకు రవాణా నిర్వహించే అవకాశం ఈ ప్రాజెక్టు ద్వారా కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ రైల్వే మార్గంలో వేదావతి నదిపై భారీ వంతెన నిర్మించనున్నారు. అలాగే మొత్తం ప్రాజెక్టులో 52 చిన్న వంతెనలు, 7 ప్రధాన వంతెనలు, ఒక మెగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో రైల్వే మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
రసాయన పరిశ్రమలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘భవ్య రసాయన్’ (Bhavya Rasayan) పథకానికి కూడా ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశంలో మూడు డెడికేటెడ్ కెమికల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పార్కు అభివృద్ధికి రూ.1,000 కోట్లు కేటాయించనుండగా, ప్రతి పార్కు 8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడుతుంది.
రసాయనాల తయారీలో విదేశాలపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తిని పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలు సృష్టించడం ‘భవ్య రసాయన్’ పథకం ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కెమికల్ పార్కులు ఏర్పాటుతో ఆధునిక మౌలిక వసతులు, పరిశ్రమలకు అవసరమైన సౌకర్యాలు ఒకేచోట లభించడం వల్ల తయారీ రంగానికి కొత్త ఊపు వస్తుందని ఆయన పేర్కొన్నారు.
రైల్వే మౌలిక వసతుల విస్తరణతో రవాణా రంగం బలోపేతం కావడం, మరోవైపు రసాయన పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కేంద్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని ఈ నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి.
Tags
Be the first to react