Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి 20 పీఎం ఈ-బస్సులు.. విశాఖలో గ్రీన్ మొబిలిటీకి మరో ముందడుగు!

Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్యావరణహిత ప్రజా రవాణా సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రిపీఎం ఈ-బస్సు సేవ స్కీమ్ కింద విశాఖపట్నం స్టీల్ సిటీ డిపో నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రత్యేకంగా 20 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

E Buses Bhogapuram Airport
E Buses Bhogapuram Airport

విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి అత్యాధునిక ఈ-బస్సుల సేవలు..

విశాఖ–భోగాపురం ప్రయాణానికి కాలుష్యరహిత రవాణా సేవలు..

విశాఖపట్నం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్యావరణహిత ప్రజా రవాణా సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి పీఎం ఈ-బస్సు సేవ స్కీమ్ కింద విశాఖపట్నం స్టీల్ సిటీ డిపో నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రత్యేకంగా 20 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆర్టీసీ ఈడీ, రీజినల్ మేనేజర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి, ఎమ్మెల్యేతో పాటు అధికారులు ఈ-బస్సులో ప్రయాణించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు.

ప్రధానమంత్రి పీఎం ఈ-బస్సు సేవ స్కీమ్ ద్వారా రాష్ట్రానికి మొత్తం 1,050 ఎలక్ట్రిక్ బస్సులు రానుండగా, వాటిలో 100 బస్సులు విశాఖపట్నానికి కేటాయించారు. ఈ 100 బస్సుల్లో తొలి విడతగా 20 బస్సులను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేకంగా నడపనున్నారు.

భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బస్సులు గాజువాక – ఎన్‌ఏడీ – ఆనందపురం మరియు గాజువాక – రైల్వే స్టేషన్ – ఆర్టీసీ కాంప్లెక్స్ – సిరిపురం  రెండు ప్రధాన మార్గాల్లో సేవలు అందించనున్నాయి. ఈ మార్గాల ద్వారా నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందుబాటులోకి రానుంది.

ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన ఈ బస్సులు 12 మీటర్ల పొడవు, ఎయిర్ సస్పెన్షన్, ఆటోమేటిక్ డోర్లు, 35 సీట్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అలాగే దివ్యాంగుల కోసం ప్రత్యేక వీల్‌చైర్ లిఫ్ట్ ఏర్పాటు చేయడం ద్వారా అందరికీ అందుబాటులో ఉండే ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందు నుంచే పర్యావరణహిత ప్రజా రవాణా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం గ్రీన్ మొబిలిటీ లక్ష్యాలను వేగవంతం చేస్తోంది. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించే ఈ ఎలక్ట్రిక్ బస్సులు విశాఖ నగరం–భోగాపురం విమానాశ్రయం మధ్య ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందించనున్నాయి.

రాష్ట్రంలో ప్రజా రవాణాను ఆధునికీకరించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు.

Tags

1 readers have reacted

Latest