Umrah: ఉమ్రా యాత్రికులతో సందడిగా సౌదీ అరేబియా.. కొత్త సీజన్‌లో 22.5 శాతం పెరిగిన వీసాలు!
Umrah: సౌదీ అరేబియాలో కొత్త ఉమ్రా సీజన్‌కు విశేష స్పందన లభిస్తోంది. 1448 హిజ్రీ (2026) ఉమ్రా సీజన్ ప్రారంభమైన తొలి వారాల్లోనే గత ఏడాదితో పోలిస్తే ఉమ్రా వీసాలపై వచ్చిన యాత్రికుల సంఖ్య 22.5 శాతం పెరిగినట్లు సౌదీ హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ధుల్ హిజ్జా 15వ తేదీ నుంచి ముహర్రం నెలాఖరు వరకు 9.31 లక్షల మందికి పైగా ఉమ్రా యాత్రికులు సౌదీకి చేరుకున్నారు.
కొత్త ఉమ్రా సీజన్‌కు భారీ స్పందన.. 9.31 లక్షల మంది యాత్రికుల రాక..
సౌదీ విజన్-2030 ఫలితం.. ఉమ్రా యాత్రలో కొత్త రికార్డులు..
రియాద్: సౌదీ అరేబియాలో కొత్త ఉమ్రా సీజన్‌కు విశేష స్పందన లభిస్తోంది. 1448 హిజ్రీ (2026) ఉమ్రా సీజన్ ప్రారంభమైన తొలి వారాల్లోనే గత ఏడాదితో పోలిస్తే ఉమ్రా వీసాలపై వచ్చిన యాత్రికుల సంఖ్య 22.5 శాతం పెరిగినట్లు సౌదీ హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ధుల్ హిజ్జా 15వ తేదీ నుంచి ముహర్రం నెలాఖరు వరకు 9.31 లక్షల మందికి పైగా ఉమ్రా యాత్రికులు సౌదీకి చేరుకున్నారు.
ఈ కాలంలో మొత్తం 12.7 లక్షల మందికి పైగా విదేశీ యాత్రికులు సౌదీ అరేబియాలో అడుగుపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ పెరుగుదలకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, వివిధ శాఖల సమన్వయం, డిజిటల్ సేవల విస్తరణ, సౌదీ విజన్–2030 కింద చేపట్టిన సంస్కరణలే ప్రధాన కారణాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సౌదీకి వచ్చిన అంతర్జాతీయ యాత్రికుల్లో 75 శాతం మంది విమాన మార్గం ద్వారా చేరుకోగా, మిగిలిన 25 శాతం మంది భూ, సముద్ర మార్గాల ద్వారా ప్రవేశించారు. రవాణా సౌకర్యాల మెరుగుదల వల్ల యాత్రికులకు ప్రయాణం మరింత సులభమైందని అధికారులు తెలిపారు.
ఉమ్రా యాత్రికుల సంఖ్యలో పాకిస్థాన్ తొలి స్థానంలో నిలిచింది. అక్కడి నుంచి సుమారు 2 లక్షల మంది యాత్రికులు సౌదీకి చేరుకున్నారు. అనంతరం ఇండోనేషియా నుంచి 1.70 లక్షల మంది, ఇరాక్ నుంచి 1.30 లక్షల మంది ఉమ్రా యాత్రికులు వచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
1448 హిజ్రీ ఉమ్రా సీజన్ కోసం మే 31, 2026 నుంచే సౌదీ ప్రభుత్వం వీసాలు జారీ చేయడం ప్రారంభించింది. ఇదే రోజు నుంచి విదేశీ యాత్రికుల రాక కూడా ప్రారంభమైంది.
ప్రస్తుత ఉమ్రా సీజన్ 2027 మార్చి 23 వరకు కొనసాగనుంది. 2027 మార్చి 9 ఉమ్రా వీసాల జారీకి చివరి తేదీగా నిర్ణయించారు. యాత్రికులు మార్చి 23లోపు సౌదీలోకి ప్రవేశించాలి, అలాగే ఏప్రిల్ 7, 2027లోపు దేశం విడిచి వెళ్లడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.
ఉమ్రా అనుమతులు, బుకింగ్‌లు, ఇతర యాత్ర సేవల కోసం సౌదీ ప్రభుత్వం రూపొందించిన 'నుసుక్' (Nusuk) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాప్ ద్వారా యాత్రికులు అవసరమైన అన్ని అనుమతులను సులభంగా పొందే అవకాశం ఉంది.
సౌదీ విజన్–2030లో భాగంగా ఉమ్రా సేవల్లో డిజిటల్ మార్పులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎలక్ట్రానిక్ పర్మిట్లు, ఆటోమేటెడ్ కాంట్రాక్టింగ్ విధానం, క్యూఆర్ కోడ్ ధృవీకరణ వ్యవస్థ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు అనుగుణంగా రవాణా, వసతి, ఇతర మౌలిక సదుపాయాలను కూడా విస్తరించింది.
2025లో చివరి త్రైమాసికంలోనే 1.1 కోట్లకు పైగా ఉమ్రా యాత్రికులు సౌదీని సందర్శించారు. తాజాగా కొత్త సీజన్ ప్రారంభంలోనే నమోదైన వృద్ధి ప్రపంచవ్యాప్తంగా మతపరమైన పర్యాటకానికి, ఉమ్రా యాత్రకు పెరుగుతున్న ఆదరణను మరోసారి స్పష్టం చేస్తోందని సౌదీ అధికారులు పేర్కొన్నారు.
Tags
Be the first to react
