సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026-27 విద్యాసంవత్సరం నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఓపెన్-బుక్ అసెస్‌మెంట్ (OBA) విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పాఠశాలల్లో ఈ ఫార్మాట్ సాధ్యాసాధ్యాలపై పైలట్ అధ్యయనం అనంతరం బోర్డు పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కొత్త విధానం ద్వారా విద్యార్థులు పరీక్ష సమయంలో పాఠ్యపుస్తకాలు, క్లాస్ నోట్స్, బోర్డు ఆమోదించిన ఇతర వనరులను ఉపయోగించుకోవచ్చు. లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ వంటి ప్రధాన సబ్జెక్టులు దీనిలో భాగమవుతాయి. పాఠశాలలు ఈ విధానాన్ని అమలు చేయాలా వద్దా అనేది వారి అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఏడాది జరిగే మూడు పెన్-పేపర్ పరీక్షల్లో OBAను చేర్చనున్నారు.
డిసెంబర్ 2023లో ఆమోదించిన పైలట్ ప్రాజెక్ట్‌లో 9 నుంచి 12 తరగతులపై ప్రయోగాత్మకంగా ఈ పరీక్షలు నిర్వహించగా, విద్యార్థుల పనితీరు 12% నుంచి 47% వరకు మెరుగుపడిందని అధ్యయనం వెల్లడించింది. వనరుల వినియోగ సామర్థ్యం, ఇంటర్‌డిసిప్లినరీ అర్థం చేసుకోవడంలో ఇది ఉపకరిస్తుందని, విమర్శనాత్మక ఆలోచన పెంపొందిస్తుందని ఉపాధ్యాయులు కూడా అభిప్రాయపడ్డారు.
CBSEలో ఓపెన్-బుక్ విధానం ఇదే మొదటిసారి కాదు. 2014లో 9, 11 తరగతులకు ఓపెన్ టెక్స్ట్-బేస్డ్ అసెస్‌మెంట్ (OTBA) ప్రవేశపెట్టినా, పెద్దగా ఫలితాలు ఇవ్వకపోవడంతో 2017-18లో నిలిపివేశారు.