టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా గుర్తింపు పొందిన గామా అవార్డ్స్ 55వ ఎడిషన్ వేడుకలు ఇటీవల షార్జా ఎక్స్పో సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. వైభవ్ Keinfra Properties ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొని వేడుకకు మరింత రంజకంగా మార్చారు. గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు, సీఈఓ సౌరభ్ కేసరి నాయకత్వంలో ఈ వేడుక ఘనంగా నిర్వహించబడింది. ఇప్పటికే నాలుగు ఎడిషన్లు విజయవంతంగా జరిగిన ఈ అవార్డ్స్ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాయి.
ఈసారి గామా అవార్డ్స్‌లో పుష్ప 2 ది రూల్ చిత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం గామా బెస్ట్ మూవీ అవార్డుతో పాటు, సుకుమార్‌కు బెస్ట్ డైరెక్టర్, దేవిశ్రీ ప్రసాద్‌కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డులు దక్కాయి. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా, రత్నవేలు బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా అవార్డులు అందుకున్నారు. అలాగే, ఈ చిత్రంలోని ఇతర విభాగాలు కూడా మంచి గుర్తింపును పొందాయి.
ఇక లక్కీ భాస్కర్ చిత్రానికి సంబంధించిన విభాగాలు కూడా అవార్డ్స్ వేదికపై నిలిచాయి. మీనాక్షి చౌదరి బెస్ట్ హీరోయిన్‌గా అవార్డును అందుకోగా, నవీన్ నూలి బెస్ట్ ఎడిటర్‌గా నిలిచారు. అదేవిధంగా భాను మాస్టర్ "మిస్టర్ బచ్చన్"లోని పాటకు బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. రామ జోగయ్య శాస్త్రి "దేవర"లో పాటకు బెస్ట్ లిరిసిస్ట్‌గా ఎంపికయ్యారు.
ప్లే బ్యాక్ సింగర్స్ విభాగంలో కూడా ప్రత్యేక గుర్తింపు లభించింది. అనురాగ్ కులకర్ణి "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"లో పాటకు బెస్ట్ మేల్ సింగర్‌గా నిలిచారు. మంగ్లీ "ఫ్యామిలీ స్టార్"లో పాటకు బెస్ట్ ఫిమేల్ సింగర్‌గా గెలిచారు. అలాగే సమీరా భరద్వాజ్ బెస్ట్ క్రిటిక్ సింగర్‌గా అవార్డు అందుకున్నారు.
కొత్త తరానికి చెందిన నటులు, దర్శకులు కూడా ఈ వేదికలో సత్కరించబడ్డారు. తేజ సజ్జా బెస్ట్ యాక్టర్ క్రిటిక్‌గా, కిరణ్ అబ్బవరం జ్యూరీ బెస్ట్ యాక్టర్‌గా నిలిచారు. రాజా రవీంద్ర, హర్ష చెముడు, వినయ్ రాయ్ వంటి వారు తమ తమ విభాగాల్లో గౌరవించబడ్డారు. నిహారిక కొణిదెల "కమిటీ కుర్రాళ్ళు" చిత్రానికి బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ అవార్డును అందుకున్నారు.

సినీ రంగానికి విశేషంగా సేవలందించిన వారిని కూడా గౌరవించారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం గ్లోబల్ కమెడియన్ అవార్డు అందుకోగా, నిర్మాత అశ్వినీ దత్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించబడ్డారు. అదనంగా హీరో సత్యదేవ్ "జీబ్రా" చిత్రానికి ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డును గెలుచుకున్నారు. కార్యక్రమం ముగింపు సమయంలో సీఈఓ సౌరభ్ కేసరి, ఈ అవార్డ్స్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.