కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కీలకమైనది. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, వరదలు, తుఫానులు, తెగుళ్లు వంటి కారణాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకంలో రైతులు తక్కువ ప్రీమియం (ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, వాణిజ్య పంటలకు 5%) చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. పంట కోసిన తర్వాత 14 రోజుల లోపల జరిగే నష్టాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.
ఆగస్టు 11 అనగా ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దేశవ్యాప్తంగా 30 లక్షల మంది రైతులకు రూ. 3,200 కోట్లు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందులో అత్యధిక నిధులు మధ్యప్రదేశ్ (రూ. 1,156 కోట్లు) మరియు రాజస్థాన్ (రూ. 1,121 కోట్లు) రాష్ట్రాలకు వెళ్తాయి. మిగిలిన రూ. 903 కోట్లు ఇతర రాష్ట్రాలకు అందనున్నాయి. ఈ ఆర్థిక సాయం రైతుల వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించడంలో ఎంతో ఉపయోగపడనుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్‌లో ఆగస్టు 15 వరకు పంటలకు బీమా చేయించుకోవచ్చు. కేవలం రూ. 76 ప్రీమియం చెల్లిస్తే రూ. 38,000 వరకూ బీమా వర్తిస్తుంది. తెలంగాణలో ఈ పథకం గతంలో నిలిపివేయబడినా, రానున్న వానాకాలం సీజన్ నుండి మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఇరురాష్ట్రాల రైతులు ఈ పథకం ప్రయోజనాలను పొందగలరని నిపుణులు చెబుతున్నారు.