కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వెంకటేశ్వరరావు అనే వృద్ధుడిని గమనించిన మంత్రి, వెంటనే తన వాహనాన్ని ఆపి దగ్గరికి వెళ్లారు.
లారీ ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలైన ఆ వృద్ధుడికి స్వయంగా ప్రథమ చికిత్స చేసి, గాయానికి కట్టుకట్టి, తన కాన్వాయ్‌లోని కారులో మంగళగిరి ఆసుపత్రికి తరలించారు. మంత్రిగారి తక్షణ స్పందనతో ఆ వృద్ధుడి ప్రాణాలు కాపాడబడ్డాయి.
ఈ ఘటనకు ముందు, డాక్టర్ పెమ్మసాని తెనాలి రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో కలిసి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, డిసెంబర్‌లోపు తొలి దశ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
కేంద్రంలోని అమృత్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, తెనాలి స్టేషన్ కూడా అందులో భాగమేనని ఆయన తెలిపారు. స్థానికులు తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించడానికి హామీ ఇచ్చారు.