ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పలు కీలక చర్యలను చేపడుతోంది. మహిళలు ఆర్థికంగా బలపడేలా, స్వయం ఉపాధి పొందేలా అనేక పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది డ్వాక్రా సంఘాల ఏర్పాటు. ఈ సంఘాల ద్వారా సున్నా వడ్డీతో రుణాలు అందించి, మహిళలు తమ పాదాలపై నిలబడేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
ఇదే దిశగా, పట్టణ స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులైన డిగ్రీ చదివిన మహిళల కోసం కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెడుతోంది. ఈ ప్రాజెక్ట్ పేరు “డిజి లక్ష్మి”. ప్రజలకు డిజిటల్ సేవలు సులభంగా అందించడంతో పాటు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (MEPMA) ఆధ్వర్యంలో, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యం.
ఈ కార్యక్రమం కింద, సీఎస్‌ఈ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ తో భాగస్వామ్యంగా, పట్టణాల్లోని స్లమ్ లెవల్ సమాఖ్య పరిధిలో ఒక్కొక్క సీఎస్‌సీ కియోస్క్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల ద్వారా వ్యాపార లైసెన్స్‌లు, రేషన్ కార్డు దరఖాస్తులు వంటి మీసేవా ద్వారా అందించే అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటాయి.
ప్రారంభ దశలో ప్రతి కియోస్క్‌లో ఒక డిగ్రీ చదివిన మహిళతో పాటు మరో ఇద్దరు మహిళలకు ఉపాధి లభిస్తుంది. మొదటగా సుమారు 20 రకాల సేవలు అందించనున్నారు. తర్వాత ఈ సేవల పరిధిని మరింత విస్తరించనున్నారు. పౌరులు నిర్దేశిత రుసుము చెల్లించి ఈ సేవలను పొందవచ్చు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, గూడూరు, బేతంచెర్ల ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం సుమారు 300 కుటుంబాలకు ఒక కియోస్క్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది.
ఈ విధంగా, డిజి లక్ష్మి ప్రాజెక్ట్ ద్వారా పౌర సేవలు ఇళ్ల దగ్గర్లోనే అందుబాటులోకి రావడంతో పాటు, డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.