ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మెగా డీఎస్సీ-2025 ఫలితాలపై ఇవాళ లేదా రేపటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల పరీక్షల ఫైనల్ కీ విడుదలైన విషయం తెలిసిందే. అయితే అందులో కొన్ని ప్రశ్నలకు సంబంధించిన జవాబులపై తప్పులున్నాయని పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈ అభ్యంతరాలపై విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం నిపుణుల కమిటీతో సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం. కమిటీ సూచనలు అందుకున్న తర్వాతే ఫలితాల ప్రకటనపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 25వ తేదీ లోపల ఫలితాలు విడుదల చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
మెగా డీఎస్సీ ద్వారా ప్రభుత్వం 16,347 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో పాఠశాల సహాయాధ్యాపకులు, భాషా పండితులు, పీఈటీలు తదితర విభాగాల్లో నియామకాలు ఉంటాయి. ఈ నియామకాలు కోసం వేలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు త్వరలోనే స్పష్టత రానుందని భావిస్తున్నారు.