ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగనుంది. సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆగస్టు 13, 14 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీసత్యసాయి, కడప, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇటీవలి ఉక్కపోత వాతావరణం తరువాత వర్షాలు ఉపశమనం కలిగించినప్పటికీ, హైదరాబాద్ వంటి నగరాల్లో భారీ వర్షాలు రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండటం, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం వలన నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు.