ప్రైవేట్ రంగంలో అగ్రగామి అయిన ICICI బ్యాంక్ కొత్త కస్టమర్లకు గట్టి షాక్ ఇచ్చింది. నెలవారీ కనీస సగటు నగదు నిల్వ (Monthly Average Balance – MAB) నిబంధనలను ఆగస్టు 1 నుంచి సవరించింది. ఈ మార్పులు ముఖ్యంగా మెట్రో మరియు అర్బన్ ఏరియాల్లో ప్రభావం చూపనున్నాయి.
ఇప్పటి వరకు మెట్రో, అర్బన్ ఏరియాల్లోని కస్టమర్లు రూ.10,000 MAB ఉంచితే సరిపోతుండగా, కొత్త నిబంధనల ప్రకారం ఇది ఐదు రెట్లు పెరిగి రూ.50,000కి చేరింది. సెమీ అర్బన్ బ్రాంచ్‌లలో రూ.25,000 MAB కొనసాగించాలి. గ్రామీణ బ్రాంచ్‌లలో మాత్రం రూ.5,000 MAB యథాతథంగా ఉంటుంది.
నిబంధనలను పాటించని వారికి బ్యాంక్ కఠినంగా జరిమానా విధించనుంది. సగటు నిల్వలో లోటు ఉంటే 6% లేదా రూ.500 (ఏది తక్కువైతే అది) పెనాల్టీగా వసూలు చేస్తారు. ఈ మార్పులు కొత్తగా ఖాతా తెరవబోయే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని, పాత కస్టమర్లకు ప్రస్తుత నిబంధనలు యథాతథంగా ఉంటాయని బ్యాంక్ స్పష్టం చేసింది.
బ్యాంకింగ్ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం అధిక నిధులు బ్యాంకులో నిల్వ ఉండేలా చేయడమే కాకుండా, ఆపరేషనల్ ఖర్చులను తగ్గించడానికీ సహాయపడుతుంది. అయితే, సాధారణ కస్టమర్లపై ఇది ఆర్థిక భారం మోపే అవకాశముందని కొందరు అంటున్నారు.
ఈ మార్పులు ముఖ్యంగా సాలరీ అకౌంట్లు కాకుండా సేవింగ్స్ అకౌంట్లు తెరవాలనుకునే కొత్త కస్టమర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా ఖాతా తెరవబోయేవారు ఈ నిబంధనలను ముందుగా తెలుసుకోవాలని, తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.