ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) సీజన్ 4 వైజాగ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. ACA స్టేడియంలో జరిగిన ఈ ప్రారంభోత్సవం క్రీడాభిమానులను, ప్రేక్షకులను ఉత్సాహభరితంగా మార్చింది. ఈ వేడుకకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సినీ నటుడు వెంకటేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి ACA అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని స్వాగతం పలికారు.
ప్రారంభోత్సవంలో నటి ప్రగ్యా జైస్వాల్ అందమైన నృత్య ప్రదర్శనతో స్టేడియంని కట్టిపడేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ సంగీత ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. లేజర్ షో మరియు డ్రోన్ షోస్ స్టేడియాన్ని రంగుల కాంతుల హరివిల్లు లాగా మార్చి అందరినీ మంత్ర ముగ్ధులను చేశాయి.
ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో ACA భారీ ఏర్పాట్లు చేసింది. వివిధ జట్లలో యువ క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునే మంచి వేదిక లభిస్తోంది. టోర్నమెంట్‌లో పలు ఉత్కంఠభరితమైన పోటీలు జరిగే అవకాశం ఉండటంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ప్రారంభ మ్యాచ్‌గా కాకినాడ కింగ్స్ మరియు అమరావతి రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. రెండు జట్లు కూడా శక్తివంతమైన ఆటగాళ్లతో బరిలోకి దిగడంతో ఈ పోటీపై ప్రత్యేక దృష్టి నెలకొంది. ప్రేక్షకులు స్టేడియంలోనే కాకుండా, లైవ్ టెలికాస్ట్ ద్వారా కూడా పెద్ద ఎత్తున వీక్షిస్తున్నారు.
ఈ సీజన్ ద్వారా ఆంధ్ర క్రికెట్‌కు మరింత గుర్తింపు రావడంతో పాటు, స్థానిక క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అవకాశాలు దక్కే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.