ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఇకపై భూముల వ్యవహారాల్లో ఆధార్ సేవలను అందించే యూజర్ ఏజెన్సీగా రెవెన్యూ శాఖను ఎంపిక చేసింది. UIDAI, కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ అనుమతితో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవోలు 309, 310 జారీ చేసింది.
ఇంతకు ముందు రైతులు ప్రైవేట్ ఏజెన్సీలకు వెళ్లి ఐరిస్ డేటా ఇవ్వాల్సి వచ్చేది. దీంతో రికార్డుల సవరణలో ఆలస్యం, ఆధార్ సీడింగ్ సమస్యల కారణంగా పంటల బీమా, పెట్టుబడి పథకాలు సకాలంలో అందేవి కాదు. చాలా మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకంలో కూడా నష్టపోయారు. ఇకపై రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోనే భూములకు ఆధార్ అనుసంధానం జరుగుతుంది.
ప్రతి తహశీల్దార్ కార్యాలయంలో ఆధార్ సేవల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. రైతులు ఇకపై మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే ఆధార్ సీడింగ్ చేసుకోవచ్చు. ప్రైవేటు ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతోనే పనులు పూర్తవుతాయి. దీని వల్ల రైతులకు సేవలు సులభంగా అందుతాయని అధికారులు చెబుతున్నారు.