ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో హారర్ కామెడీ సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, తాజాగా మరో హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బకాసుర రెస్టారెంట్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం సన్‌ఎన్‌ఎక్స్‌టీ (SunNXT) వేదికగా వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 8 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రంలో హాస్యనటులు ప్రవీణ్, వైవా హర్ష, కేజీయఫ్ గరుడరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకత్వం ఎస్.జె. శివం వహించారు. కథ పరమేశ్వర్ (ప్రవీణ్) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ అతడికి వ్యాపారం చేయాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రెస్టారెంట్ పెట్టాలని కలలు కంటాడు.
తన కల గురించి రూమ్‌మేట్స్‌తో చర్చించగా, ప్రస్తుతానికి డబ్బులు సంపాదించేందుకు ముందుగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభిద్దామని వారు సూచిస్తారు. ఈ క్రమంలో వారు దెయ్యం మీద మొదటి వీడియో తీశారు. అది వైరల్ కావడంతో రెండో వీడియో కోసం ఓ పాత బంగ్లాకు వెళతారు. అక్కడ ఒక పుస్తకం దొరకగా, దానిని ఉపయోగించి పొరపాటున క్షుద్రపూజ చేస్తారు.
ఆ క్షుద్రపూజ వల్ల బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకు వస్తుంది. మొదట్లో దానిని ఆటపట్టించాలని ప్రయత్నించిన వారిపై ఆ ఆత్మ తన ప్రభావాన్ని చూపుతుంది. పరమేశ్వర్ స్నేహితుడు ఆ ఆత్మ ఆధీనంలోకి వెళ్ళిపోతాడు. అతడి శరీరంలోకి ప్రవేశించిన బక్క సూరి ఆకలికి ఎలాంటి హద్దు ఉండదు. దాంతో గ్యాంగ్ భయంతోపాటు ఆ ఆత్మను బయటకు పంపించేందుకు మార్గాలు అన్వేషిస్తుంది.
ఇక అసలు బక్క సూరి నేపథ్యం ఏమిటి? ఆ ఆత్మ ఎందుకు అంత ఆగ్రహంగా ప్రవర్తిస్తోంది? పరమేశ్వర్ రెస్టారెంట్ పెట్టాలన్న తన కల నెరవేరిందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా సినిమా సాగుతుంది. కామెడీ, హారర్ మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది.