ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపేందుకు అటవీ శాఖ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. మనుషులు–ఏనుగుల ఘర్షణలు తగ్గించేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ సహా ఆధునిక సాంకేతికతను వినియోగించనుంది. ఏనుగులు గ్రామాలకు ఒక కిలోమీటర్ దూరంలోకి రాగానే ప్రజల మొబైల్‌ఫోన్లకు ‘‘జాగ్రత్త, ఏనుగులు వస్తున్నాయి’’ అనే అలర్ట్ సందేశాలు పంపే విధానం అందుబాటులోకి రాబోతోంది. ఇందుకోసం ప్రత్యేక ఎలిఫెంట్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, డ్రోన్లు, జీపీఎస్ పరికరాలు, ఇన్‌ఫ్రారెడ్, థర్మల్ సెన్సార్లతో కూడిన స్మార్ట్ ఫెన్సింగ్‌ను అమలు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల భద్రత కోసం కూడా అటవీ శాఖ పలు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా అలిపిరి మెట్ల మార్గంలో చిరుతల కదలికలను పర్యవేక్షించడానికి 100 కెమెరా ట్రాప్‌లు, 30 లైవ్ స్ట్రీమింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వన్యప్రాణుల కదలికలను ట్రాక్ చేస్తారు. డ్రోన్లతో నిఘా కొనసాగిస్తూ, అవసరమైతే బోనులు పెట్టి చిరుతలను పట్టుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
అదేవిధంగా పచ్చదనం పెంపుపై కూడా దృష్టి సారించారు. ప్రస్తుతం ఉన్న 64.14% అడవి కవచాన్ని 2027–28 నాటికి 80%కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో టీటీడీకి చెందిన 3,000 హెక్టార్లలో, రిజర్వ్ ఫారెస్ట్‌లోని 7,000 హెక్టార్లలో మొక్కలు నాటనున్నారు. ఈ పర్యావరణ భద్రతా చర్యల కోసం రూ.10.50 కోట్ల వ్యయం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.