ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువకుడి జీవితం దురదృష్టకరంగా ముగిసింది. బాపట్ల జిల్లా మార్టూరు గ్రామానికి చెందిన పాటిబండ్ల లోకేశ్ (25) బోస్టన్ నగరంలో స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ దుర్వార్తతో అతని స్వగ్రామంలో శోకసంద్రం అలుముకుంది.
వివరాల ప్రకారం, ఈ నెల 3న లోకేశ్ తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. గురువారం రాత్రి ఈ విషయం గురించి స్నేహితులు లోకేశ్ తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేయగా, ఆ వార్త విని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.
గ్రానైట్ వ్యాపారి పాటిబండ్ల వేణుబాబు–శాంతి దంపతుల కుమారుడు లోకేశ్, ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి, ఎనిమిది నెలల క్రితం బోస్టన్‌లో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న సమయంలోనే అకాల మరణం సంభవించడం దురదృష్టకరం. లోకేశ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తరలించేందుకు బంధువులు చర్యలు చేపడుతున్నారు. అమెరికాలో తెలుగు యువకులు వరుసగా మరణిస్తుండటంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.