ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన కుటుంబాలకు శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ సదుపాయం అందని గిరిజన ప్రాంతాల వారికి ఇప్పుడు ఉపశమనం లభించనుంది. దీపం-2 పథకం కింద 14.2 కిలోల ఎల్‌పీజీ గృహ వినియోగ సిలిండర్లను గిరిజన కుటుంబాలకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 16 జిల్లాల పరిధిలోని 23,912 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీని కోసం రూ.5.54 కోట్లు ఖర్చు చేయనుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సాధారణంగా గిరిజన ప్రాంతాల ప్రజలు 5 కిలోల సిలిండర్లను వాడుతుండటంతో, వారికి దీపం పథకం వర్తించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకే ఇప్పుడు 14.2 కిలోల సిలిండర్లు ఇవ్వాలని కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించే దీపం-2 పథకం కింద లబ్ధిదారులు ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ వివరాలు సమర్పించాలి. ఒక గృహానికి ఒకే కనెక్షన్‌కే రాయితీ వర్తిస్తుంది. ఇకపై లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా సిలిండర్ పొందే విధంగా ప్రభుత్వం కొత్త ఏర్పాట్లు చేస్తోంది. ఏవైనా ఇబ్బందులు ఉంటే 1967 టోల్‌ఫ్రీ నంబర్ లేదా గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు.