ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ 2025’ సేల్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజున అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ కూడా మొదలవుతుండటంతో, ఈ రెండు ఈ-కామర్స్ కంపెనీల మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొనబోతోంది.
ఫ్లిప్కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్స్‌కి ఒక రోజు ముందుగానే ప్రత్యేక ఆఫర్లను యాక్సెస్ చేసే సౌకర్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఫ్లిప్కార్ట్ యాప్‌లో ఈ సేల్‌కు సంబంధించిన ప్రత్యేక ల్యాండింగ్ పేజీని అప్‌డేట్ చేసింది. అయితే, ఈ సేల్ ఎంత కాలం కొనసాగుతుందో మాత్రం ఇంకా వెల్లడించలేదు.
ఈ సేల్ సందర్భంగా యాపిల్, శాంసంగ్, మోటరోలా వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు రానున్నాయి. ప్రత్యేకంగా ఐఫోన్ 16, శాంసంగ్ గెలాక్సీ ఎస్24, మోటరోలా ఎడ్జ్ 60 ప్రో, వన్స్ బడ్స్ 3 వంటి ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. అదనంగా ‘లిమిటెడ్ టైమ్ ఆఫర్లు’, ‘ఫెస్టివ్ రష్ అవర్స్’ ద్వారా కస్టమర్లకు అదనపు రాయితీలు లభించనున్నాయి.
ఇక ఇంటెల్ పీసీలు, 55 అంగుళాల స్మార్ట్ టీవీలు, ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్లు కూడా తక్కువ ధరల్లో అందుబాటులోకి రానున్నాయి. పైగా, బ్యాంక్ ఆఫర్లలో భాగంగా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే కస్టమర్లకు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.