ఆంధ్రప్రదేశ్ మీదుగా బుల్లెట్ రైలు రాబోతుందన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. హైదరాబాద్–చెన్నై కారిడార్‌లో అమరావతి మీదుగా బుల్లెట్ రైలు వెళ్లేలా ప్రతిపాదన సిద్ధమవుతోందని సమాచారం. అయితే, కొందరు విశాఖపట్నాన్ని సౌత్ కారిడార్ నుంచి తొలగించి అమరావతిని చేర్చారని తప్పుదారి పట్టించే పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో అమరావతి మునిగిపోయినట్లు చూపుతూ ఫేక్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది.
ఈ ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టతనిచ్చింది. ‘విశాఖను తీసేసి అమరావతిని పెట్టారు’ అనే ఆరోపణ పూర్తిగా అవాస్తవమని, ప్రాంతీయ విభేదాలు రేకెత్తించేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఈ ప్రచారం నమ్మవద్దని హెచ్చరించారు. వాస్తవానికి కేంద్రం దక్షిణాది రాష్ట్రాల రాజధానులను కలుపుతూ ఒక సమగ్ర ప్రతిపాదన సిద్ధం చేస్తోందని, అందులో హైదరాబాద్, అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలు మాత్రమే ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
మరోవైపు, ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ఏపీకి పెద్ద ప్రాధాన్యం ఉండనుంది. చెన్నై కారిడార్ రూట్‌లో అమరావతి మీదుగా ఏకంగా 8 స్టేషన్లు, బెంగళూరు కారిడార్ రూట్‌లో రాయలసీమ జిల్లాల మీదుగా 6 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే ప్రాజెక్ట్ ఆమోదం, నిర్మాణ ప్రక్రియలు పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ, అమరావతి మీదుగా బుల్లెట్ రైలు రావడం రాష్ట్రానికి పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు.