దేశ ఆర్థిక రాజధాని ముంబై మరోసారి ఉగ్ర బెదిరింపులతో కలవరపాటుకు గురైంది. ‘లష్కర్ ఏ జిహాదీ’ అనే ఖాతా నుంచి ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కి వచ్చిన మెయిల్‌తో సంచలనం రేగింది. మానవ బాంబులను నగరంలోకి పంపించామని, ఎప్పుడైనా భారీ పేలుళ్లు జరగవచ్చని దుండగులు హెచ్చరించారు.
ఆ బెదిరింపు ప్రకారం, 34 వాహనాల్లో మానవ బాంబులు ఉంచారని, 14 మంది పాక్ ఉగ్రవాదులు ఇప్పటికే ముంబైలోకి చొరబడ్డారని పేర్కొన్నారు. వారివద్ద 400 కిలోల ఆర్డీఎక్స్ ఉందని, నగరాన్ని అల్లకల్లోలం చేయడమే తమ లక్ష్యమని దుండగులు పేర్కొనడం మరింత భయాందోళన కలిగించింది.
ఈ పరిణామంపై ముంబై పోలీసులు వెంటనే హైఅలర్ట్ ప్రకటించారు. నగరవ్యాప్తంగా భద్రతా బలగాలను మోహరించారు. బాంబు నిర్వీర్య దళాలు, డాగ్ స్క్వాడ్‌లతో సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ముంబై ప్రజలను కోరారు.