కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పేద విద్యార్థుల కోసం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMSS) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. 8వ తరగతి తర్వాత చదువు మానేయకుండా ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించిన ప్రకటనను ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 30, 2025లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం లక్షమంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందులో 4,087 స్కాలర్‌షిప్‌లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు.
ఈ స్కాలర్‌షిప్‌కు ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మున్సిపల్, ఎయిడెడ్, మోడల్ పాఠశాలల్లో రెగ్యులర్‌గా చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు మాత్రమే అర్హులు. ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. తుది ఎంపిక సమయానికి 8వ తరగతిలో కూడా 55 శాతం మార్కులు ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.3.5 లక్షలు మించరాదు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.12 వేల చొప్పున 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కాలర్‌షిప్ అందుతుంది.
దరఖాస్తులు ఆయా పాఠశాలల ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఆ తర్వాత ప్రింట్ కాపీలు, అవసరమైన ధ్రువపత్రాలను డీఈవో కార్యాలయానికి అందజేయాలి. దరఖాస్తు సమయంలో బీసీ, ఓసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 ఫీజు చెల్లించాలి. ఆధార్ కార్డులో ఉన్న వివరాల ప్రకారం దరఖాస్తు పూరించాలి. ఈ స్కాలర్‌షిప్ పరీక్ష డిసెంబర్ 7, 2025న జరుగనుంది. దరఖాస్తుల ప్రారంభం సెప్టెంబర్ 4నుండి మొదలై, చివరి తేదీ సెప్టెంబర్ 30గా నిర్ణయించారు.