రాష్ట్రంలోని రైతులకు అండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఆగస్ట్ 4న తొలివిడత నిధులు విడుదల చేశారు. పీఎం కిసాన్ కింద వచ్చే రూ.2,000తో పాటు అన్నదాత సుఖీభవ కింద రూ.5,000 కలిపి రైతుల ఖాతాల్లో రూ.7,000 జమ అయ్యాయి. రాష్ట్రంలో సుమారు 47 లక్షల మంది రైతులకు ఈ సాయం చేరింది. అయితే, కేవైసీ మరియు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ సమస్యల వల్ల కొంతమందికి డబ్బులు జమ కాలేదు.
ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న రైతులందరికీ పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. విడతలవారీగా డబ్బులు చేరుతాయని, ఎవ్వరూ నిరాశ చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబ్బు తప్పకుండా అందుతుందని స్పష్టం చేశారు.
ఇక యూరియా సరఫరాపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఎరువుల నిల్వలు, పంపిణీ సక్రమంగా జరగాలని ఆదేశించారు. రబీ సీజన్ కోసం ఇప్పటికే 9.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించారని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యంగా కడప, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో సమస్యలు ఉన్నందున వాటిని వెంటనే పరిష్కరించమని కలెక్టర్లను ఆదేశించారు. నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు యూరియా తరలించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, అవసరమైన రవాణా ఖర్చును కూడా భరిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.