ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం విపత్తులతో అలమటిస్తోంది. వరుస భూకంపాలు ఆ దేశాన్ని చివురుటాకులా వణికిస్తున్నాయి. ఈ నెల 1వ తేదీన సంభవించిన భారీ భూప్రకోపం కారణంగా 2,205 మంది ప్రాణాలు కోల్పోగా, 3,482 మందికి పైగా గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులై బహిరంగ ప్రదేశాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. సహాయక చర్యలు జరుగుతున్న క్రమంలో మళ్లీ వరుసగా ప్రకంపనలు సంభవించాయి.
గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జామున వరుసగా మూడు భూకంపాలు చోటుచేసుకున్నాయి. తొలి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదై, ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అనంతరం రాత్రి 10:22 గంటలకు 5.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఆఫ్ఘనిస్తాన్ ఈశాన్యంలోని నగర్ హర్ ప్రావిన్స్ కేంద్రంగా ఇవి సంభవించాయి. ఉపరితలం నుంచి 160 కిలోమీటర్ల లోతులో టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఈ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది.
ఈ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌కు ఈశాన్యంగా 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అదే ప్రాంతంలో తెల్లవారు జామున 3:16 గంటలకు 4.9 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఘాజీ అమానుల్లా ఖాన్ టౌన్, గర్డీ ఘాస్ ప్రాంతాల్లో ప్రభావం తీవ్రంగా కనిపించింది. పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల అక్కడ కూడా స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. పలుచోట్ల ఇళ్లు బీటలు వారగా, ప్రజలు బయటికి పరుగులు తీశారు.
ఆ తర్వాత మళ్లీ 4.3 తీవ్రతతో మరొక భూకంపం సంభవించింది. ఇప్పటికే 1వ తేదీ నాటి ప్రకోపం కారణంగా సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఈ కొత్త జంట భూకంపాలు ప్రజలను మరింతగా వణికించాయి. భయాందోళనలతో రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడిపారు. మరల తేలికపాటి ప్రకంపనలు వస్తాయనే భయంతో ఇళ్లలోకి వెళ్లక, రోడ్లపైనే రాత్రి గడిపారు.
ఆఫ్ఘనిస్తాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండటంతో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా హిందూ కుష్ రీజియన్ తరచూ ప్రకంపనలకు గురవుతుంది. ఇదే పరిధిలో ఉన్న కెనడా, అమెరికా, మెక్సికో, జపాన్, ఇండోనేషియా, న్యూజిలాండ్ వంటి దేశాలు కూడా భూకంప ప్రభావం ఎక్కువగా ఎదుర్కొంటుంటాయి. ఇలాగే వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.