హైదరాబాద్ నగర ప్రజలకు జలమండలి (HMWS&SB) కీలక ప్రకటన చేసింది. గోదావరి పంపింగ్ స్టేషన్లలో మరమ్మతు పనుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో 48 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నారు. సెప్టెంబర్ 9 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 11 ఉదయం 6 గంటల వరకు ఈ అంతరాయం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
మల్లారం, ముర్ముర్, కొండపాక పంపింగ్ స్టేషన్లలో అత్యవసర రిపేర్ పనులు చేపట్టనున్నారు. ఈ క్రమంలో పంపింగ్ మెయిన్‌ను షట్‌డౌన్ చేయాల్సి రావడంతో, నగరానికి గోదావరి జలాల సరఫరా నిలిచిపోతుందని జలమండలి అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.
ఎస్సార్ నగర్, సనత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, నిజాంపేట, బాచుపల్లి సహా అనేక ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. రెండు రోజుల పాటు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.