ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఫాస్ట్ ఫుడ్. వేగంగా తయారయ్యే ఈ స్నాక్ రుచికరమైనప్పటికీ, అధికంగా తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి వారం మూడు ప్లేట్ల ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం సుమారు 20% పెరుగుతుందని ఒక పరిశోధన వెల్లడించింది. ఈ అధ్యయనంలో ఉడికించిన లేదా కాల్చిన బంగాళాదుంపలు తీసుకోవడం వల్ల మాత్రం అలాంటి ముప్పు ఉండదని తేలింది.
హార్వర్డ్ మరియు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు 40 సంవత్సరాలపాటు 2 లక్షల మందిపై సేకరించిన డేటాను విశ్లేషించారు. ప్రారంభంలో మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ లేని ఈ వ్యక్తులలో 40 ఏళ్ల తర్వాత 22,300 మందికి మధుమేహం వచ్చినట్లు గుర్తించారు. వారంలో మూడుసార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్న వారిలో మధుమేహం రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
అదే సమయంలో, బంగాళాదుంపలకు బదులుగా తృణధాన్యాలు తీసుకున్నవారిలో మధుమేహం ప్రమాదం తగ్గగా, అన్నం తీసుకున్నవారిలో ఆ ప్రమాదం పెరిగినట్లు తేలింది. బంగాళాదుంపల్లో పీచు, విటమిన్ C, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నప్పటికీ, అధికంగా స్టార్చ్ మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ చేస్తుంది.