కాంతార చాప్టర్ 1 సినిమా ఇప్పుడు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపుతోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ వంటి పలు భాషలలో ఒకేసారి విడుదల కానుంది. ముఖ్యంగా తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ను ప్రముఖ హీరో ప్రభాస్ విడుదల చేయగా, ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ దూసుకుపోతోంది.
హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడిగానూ, కథానాయకుడిగానూ రిషబ్ శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ కనిపించనుండగా, గుల్షన్ దేవయ్య, జయరామ్ లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అంజనీష్ లోకనాథ్ అందించారు.
ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. నాన్న ఎక్కడ ఉన్నాడు? ఎందుకు మాయమయ్యాడు? అది మన మూలం... మన పూర్వీకులు అందరూ ఇక్కడే ఉన్నారు అంటూ వచ్చే డైలాగులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎప్పుడు అధర్మం వైపు మనిషి వెళ్తాడో, ధర్మాన్ని కాపాడటానికి ఈశ్వరుడు తన గణాలను పంపుతూనే ఉంటాడు అని గురువు చెప్పే మాటలు, అక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు అని సైనికుడు హెచ్చరించే సన్నివేశాలు కథలో మిస్టరీని పెంచుతున్నాయి.
అలాగే రాజ కుటుంబ సభ్యుడు చెప్పే వంశానికి ఉన్న కళంకాన్ని కాంతారా వాళ్ల రక్తంతో కడిగేస్తాను అనే సంభాషణ, మంటల్ని ఆపేది ఎవరు? చీకట్లో ధర్మంగా నిలిచేవాళ్లను వదిలిపెట్టకు అని వచ్చే డైలాగులు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఆ దేవుడు ఈ పుణ్యభూమిని పాలించాడా, ఇప్పటికీ ఇక్కడే ఉన్నాడా అన్న ప్రశ్నలకు ట్రైలర్‌లో సూచనలు ఇవ్వడం కూడా పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
ఇది కాంతార సినిమాకు ప్రీక్వెల్ కావడం మరో విశేషం. మొదటి సినిమాలో చూపించిన సంప్రదాయాలు, పూర్వీకుల చరిత్ర, వాటి మూలాలను ఈ చిత్రంలో లోతుగా చూపించబోతున్నారు. అద్భుతమైన విజువల్స్, శక్తివంతమైన డైలాగులు, భయానకమైన వాతావరణం కలిసి ప్రేక్షకుల్లో థియేటర్ అనుభవం కోసం ఎదురుచూపులు పెంచేశాయి.
ఇప్పటికే నెటిజన్లు ఈ రేంజ్‌లో ట్రైలర్ ఉంటే, థియేటర్స్ దగ్గర ఆఫీస్ బద్దలైపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా కాంతార చాప్టర్ 1 ఈ ఏడాది ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది అని చెప్పుకోవచ్చు.