కెనడాలోని మాంట్రియల్‌లో జరిగిన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) 42వ అసెంబ్లీలో ఒమన్ ఎయిర్‌కు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఒమన్ పౌర విమానయాన అథారిటీ (CAA) ప్రకటించిన ప్రకారం, ఒమన్ ఎయిర్ సేవలు ఇప్పుడు మరో మూడు దేశాలకు విస్తరించబోతున్నాయి.ఆ దేశాలు సిరియా, గయానా, కోట్ డి’ఐవోర్ అని తెలిపారు.
ఈ సందర్భంగా ఒమన్ తరపున పౌర విమానయాన అథారిటీ అధ్యక్షుడు నైఫ్ బిన్ అల్ అలీ సంతకాలు చేయడం జరిగినది. ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందాలు ఒమన్ జాతీయ ప్రయోజనాలకు మద్దతు ఇస్తాయని, భాగస్వామ్య దేశాలతో ఉన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింతగా పెంచుతాయని తెలిపారు. విమానయాన రంగంలో ఒమన్ చేస్తున్న కృషి, దేశాన్ని ఒక పెద్ద లాజిస్టిక్స్ హబ్‌గా నిలబెట్టడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ మూడు దేశాలతో పాటు, ఈజిప్ట్‌తో కూడా ఒమన్ ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. దీని ఉద్దేశ్యం పౌర విమానయానంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం మాత్రమేనని తెలిపారు. ముఖ్యంగా జాతీయ విమానయాన సంస్థల కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుందని వివరించడం జరిగినది.
మాంట్రియల్ వేదికగా కుదిరిన ఈ ద్వైపాక్షిక ఒప్పందాలు భవిష్యత్తులో ఒమన్ ఎయిర్ సేవలకు మరిన్ని అవకాశాలు తెరుస్తాయని ఆ దేశ అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీనివల్ల ప్రయాణికులకు కూడా కొత్త మార్గాలు అందుబాటులోకి అదేవిధంగా ఒమన్ అంతర్జాతీయ రవాణా రంగంలో తన ప్రాధాన్యతను పెరుగుతుందని తెలిపారు.
ప్రస్తుతం ఒమన్ ఎయిర్ సేవలు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలకు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఒప్పందాలతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఒమన్ ఎయిర్ మధ్యప్రాచ్యంలోని ప్రముఖ విమానయాన సంస్థలలో ఒకటిగా తన స్థానాన్ని బలపరచుకోనుంది.