రాష్ట్రంలో చేనేతల ప్రోత్సాహంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, యూనిఫాం తయారీ ఆర్డర్లు కొంత శాతం చేనేత సొసైటీలకు ఇవ్వడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు శాసనసభ్యులతో కూడిన వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో ఆప్కోకు ఇచ్చిన ఆర్డర్లలో సకాలంలో సరఫరా జరగలేదని గుర్తుచేస్తూ, ఈసారి సమర్థవంతంగా వ్యవహరించడానికి నిర్మాణాత్మక మార్పులు అవసరమని పేర్కొన్నారు.
అలాగే, యూనిఫాం టెండర్ల విషయంలో మార్కెట్ ధరల పోటీని ఎలా ఎదుర్కోవాలో సభ్యులందరూ కలిసి చర్చించాలని లోకేష్ సూచించారు. దాదాపు 50 నియోజకవర్గాల్లో చేనేతలు ఉన్నారని, వారందరి వృత్తి రక్షణకు సమష్టి కృషి అవసరమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రోత్సహించిన స్వదేశీ స్ఫూర్తిలో భాగంగా చేనేత కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
2019–24 మధ్య విద్యార్థుల యూనిఫాం కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కొన్ని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించామని లోకేష్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత పారదర్శక టెండర్ విధానం అమలు చేసి, అత్యుత్తమమైన నాణ్యమైన యూనిఫాం విద్యార్థులకు అందించామని వివరించారు. గత ఏడాది మాత్రమే రూ.200 కోట్లు ఆదా చేశామని, రాబోయే ఐదేళ్లలో వెయ్యి కోట్లు ఆదా చేసే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.
చేనేత ప్రోత్సాహానికి మంగళగిరి నియోజకవర్గంలో వీవర్స్ శాల ద్వారా నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్నామని లోకేష్ తెలిపారు. ఈ శాల ద్వారా చేనేత కార్మికుల ఆదాయం 40–50 శాతం పెరిగిందని చెప్పారు. టాటా టనేరాతో ఒప్పందం చేసుకుని డిజైన్లు, మార్కెటింగ్‌లో కొత్త అవకాశాలు తెచ్చామని వివరించారు. సభ్యులు వీలున్నపుడు వీవర్స్ శాలను సందర్శించి, మార్కెట్ లింకులు ఎలా కల్పించాలో అధ్యయనం చేయాలని సూచించారు.
చేనేతల సమస్యలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రణాళికతో వృత్తిని కాపాడే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని లోకేష్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తుచేశారు. చేనేతల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా, దళారుల సమస్యను తగ్గించేలా, మరింత ప్రోత్సాహక చర్యలు కొనసాగుతాయని మంత్రి హామీ ఇచ్చారు.