బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒడిశా, బెంగాల్ సమీపంలో సముద్ర తీరంలో తిరుగుతున్న ఈ అల్పపీడనం రానున్న రెండు రోజులు అక్కడే స్థిరంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కూడా ఉంటుందని పేర్కొంది. సాధారణంగా వర్షాకాలం చివరి దశకు చేరుకున్నా, ఈ వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాలు కొనసాగేలా కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి:
తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం: ఈ ప్రాంతాల్లో సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 26, 27 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
రాయలసీమ: రాయలసీమలో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురవవచ్చు.
ఐదు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల టూవీలర్‌పై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలి.
రోజువారీ వాతావరణ అంచనాలు:
తెలంగాణ: ఈ రోజు రోజంతా మేఘాలు అలుముకుంటాయి. ఉదయం 11 తర్వాత ఉత్తర తెలంగాణలో జల్లులు మొదలవుతాయి. సాయంత్రం 4 తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడొచ్చు.
హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి రాత్రిలోపు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. అర్ధరాత్రి తర్వాత ఉత్తర తెలంగాణ, ఖమ్మం, కేసముద్రం, కొత్తగూడెం ప్రాంతాల్లో తెల్లవారుజాము వరకు వర్షాలు కొనసాగుతాయి.
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో కూడా రోజంతా మేఘాలు ఉంటాయి. సాయంత్రం 3 తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అవి తెల్లవారుజాము 3 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని చోట్ల ఎండ వస్తుంది. మేఘాలు ఉన్నా రోజంతా వాతావరణం పొడిగా ఉండే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం తూర్పు ఆగ్నేయ ఆసియాలో మూడు తుపాన్లు ఉన్నాయి. వీటి కారణంగా మన తెలుగు రాష్ట్రాల మీదుగా వీస్తున్న గాలుల వేగం పెరిగింది. అలాగే, అంటార్కిటికా నుంచి వస్తున్న అతి శీతల గాలులు కూడా భూమధ్య రేఖను చేరాయి. ఇవి మరో వారంలో దక్షిణ భారత్ వైపు వస్తాయి.
ఈ వాతావరణ పరిస్థితులన్నీ కలిసి ఈ వారం, అలాగే అక్టోబర్ మొదటి వారంలో కూడా వర్షాలు కురిసే అవకాశాలను పెంచాయి. ఈ వర్షాలు పడితే, ఈ సంవత్సరం వర్షాకాలం చాలా ఎక్కువ కాలం ఉన్నట్లు అవుతుంది. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం మంచిది.