ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ విప్లవాత్మకంగా అభివృద్ధి చెందింది. ఈ సాంకేతికతతో ఏది నిజమైన ఫొటో, ఏది ఏఐ ద్వారా క్రియేట్ అయినది అనేది గుర్తించడం కష్టంగా మారింది. హీరోల నుంచి ప్రధాని వరకూ ప్రతి ఒక్కరినీ ఏఐ ఆధారంగా మార్ఫ్ చేసి వీడియోలు, ఫొటోలు సృష్టించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. సరదాగా, వినోదం కోసం ఉపయోగిస్తే సరిపోతుంది. కానీ ఈ విధమైన ఏఐ కంటెంట్ కొన్ని సార్లు ఫేక్ న్యూస్‌ను సృష్టించడానికి వేదిక అవుతుంది. అదేవిధంగా, వ్యక్తిగత గోప్యత (Privacy) కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, భారత ప్రభుత్వం ఏఐ వాడకంపై నియంత్రణలు, నిర్దిష్ట రూల్స్ రూపొందించడానికి ముందుకొచ్చింది.
భారత ప్రభుత్వం ఏఐ కంటెంట్ క్రియేటర్లపై నియంత్రణలను అమలు చేయడానికి కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ కొన్ని సూచనలు చేసింది. లోక్‌సభ స్పీకర్ కు సమర్పించిన ముసాయిదా నివేదికలో, ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోలను సృష్టించిన వ్యక్తులు లేదా కంపెనీలను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచన ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా లో వ్యాప్తి చెందే ఫేక్ వార్తలు, ఫేక్ వీడియోలను అడ్డుకోవడానికి ఈ నియంత్రణలు కీలకం అవుతాయి.
ఈ కొత్త నియమావళి ప్రకారం, ఏఐ ఆధారిత కంటెంట్ క్రియేట్ చేసేవారికి లైసెన్సులు అవసరం అవుతాయి. కానీ ఈ లైసెన్స్ వ్యక్తిగతులకు కాకుండా, ఏఐ టూల్స్ వాడి తయారైన కంటెంట్‌కు మాత్రమే వర్తించనుంది. ఈ విధంగా సృష్టించబడిన కంటెంట్‌పై ఒక ప్రత్యేక లేబుల్ లేదా గుర్తింపు ఉంటుంది, తద్వారా ప్రేక్షకులు ఆ కంటెంట్ ఏఐ ద్వారా ఉత్పత్తి అయ్యిందా లేదా అసలు కంటెంట్ అనేది తెలుసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ప్రజలకు ఫేక్ కంటెంట్‌ను గమనించడానికి సహాయం కలుగుతుంది.
ప్రస్తుతం ఈ రూల్ చర్చల దశలో ఉంది, కానీ ప్రభుత్వం అంగీకారం తెలిపితే త్వరలో అమలులోకి వస్తుంది. ఏఐ కంటెంట్ పై లైసెన్సింగ్ విధానం వల్ల ఎలాంటి నష్టాలు తగలవు, కేవలం వినియోగదారులు ఏది ఫేక్, ఏది ఒరిజినల్ అనేది తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. దీని ద్వారా సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోల వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వానికి మార్గం తేలుతుంది. అంటే వినియోగదారులు, కంటెంట్ క్రియేటర్లు రెండూ సురక్షితంగా ఉండేలా, ఏఐ ఆధారిత సమాచారం సక్రమంగా ఉపయోగించడానికి ఇది దోహదపడుతుంది.