భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం, ఈరోజు (శనివారం) కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో అయితే ఈ నెల 9 నుంచి 14 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా. రెండు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడా పడతాయి. అలాగే, రెండు రోజుల పాటు గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది.
శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం, ఈ ఉదయం తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయి. రోజంతా మేఘావృత వాతావరణం కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు మొదలై, క్రమంగా జోరుగా పడతాయి. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల సమయంలో వర్షం తీవ్రత పెరుగుతుంది. రాత్రి 10 నుంచి అర్థరాత్రి 1 గంట వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా రోజంతా మేఘావృత వాతావరణం ఉంటుంది. సాయంత్రం 3 తర్వాత కోస్తా, ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలై, క్రమంగా పెరుగుతాయి. సాయంత్రం నాటికి కోస్తా, ఉత్తరాంధ్ర అంతటా వర్షాలు పడతాయి. రాత్రి 7 గంటల తర్వాత రాయలసీమలో వర్షాలు ప్రారంభమై, అర్థరాత్రి 1 వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం అరేబియా సముద్రం, బంగాళాఖాతం ప్రశాంతంగా ఉన్నాయి. ఎక్కడా ఆవర్తనాలు లేదా అల్పపీడనాలు లేవు. గాలి వేగం కూడా తగ్గింది. అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 35 కిలోమీటర్లు, బంగాళాఖాతంలో 37 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 13 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
ఉష్ణోగ్రత తెలంగాణలో 28 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. తేమ తెలంగాణలో పగటివేళ 70%, ఏపీలో 58% ఉంటుంది. రాత్రివేళ తెలంగాణలో తేమ 90%, ఏపీలో 94% ఉంటుంది. ఈ పరిస్థితులు రెండు రాష్ట్రాల్లో సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు వర్షాలు పడటానికి అనుకూలంగా మారుస్తాయి.
మరిన్ని రోజులు కూడా రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. మేఘాలు భారీగా ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆగ్నేయాసియాలో పొదుల్ తుపాను తైవాన్ వైపు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మిగతా ప్రాంతాల్లో కూడా మేఘాలు విస్తరించి ఉన్నాయి. అంటార్కిటికా నుంచి వచ్చే ప్రత్యేక చల్లని గాలులు, మేఘాలు ఆస్ట్రేలియాకు దగ్గరగా ఉన్నాయి. అవి వస్తే మన వర్షాల పరిమాణం మరింత పెరుగుతుంది.
మొత్తంగా ఇవాళ ప్రయాణాల కోసం వాతావరణం చక్కగా ఉంటుంది. టూవీలర్లపై వెళ్లేవారికి కూడా అనుకూలమే. అయితే, రోడ్లు కొన్ని ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి, గోతులు ఉన్నాయి. కాబట్టి అతివేగం ప్రమాదకరం. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంలో ప్రయాణిస్తే మంచిది. వర్షం సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.