ది బెస్ట్ సీఎం ర్యాంకులు... టాప్ 10లో ఎవరెవరు అంటే!
Best CM In India 2026: ఫేమ్ ఇండియా మేగజైన్ మరియు ఏషియా పోస్ట్ సంయుక్తంగా నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 897 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచారు. పుష్కర్ సింగ్ ధామీ (881), హిమంత బిశ్వ శర్మ (874) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 842 పాయింట్లతో ఆరో స్థానాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 827 పాయింట్లతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నారు. పాలనా దక్షత, ప్రజాదరణ, సంక్షేమ పథకాల అమలు ప్రాతిపదికగా మూడు దశల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఈ ఫలితాలను విడుదల చేశారు.
842 పాయింట్లతో చంద్రబాబుకు 6వ ర్యాంకు!
827 మార్కులతో దేశవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి!
856 పాయింట్లతో ఆప్ నేత భగవంత్ మాన్కు 4వ ర్యాంకు, హేమంత్ సోరెన్‌కు 5వ స్థానం!
National: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాలనా సమర్థత, పారదర్శకత, నాయకత్వ లక్షణాలు, మరియు ప్రజాదరణ ఆధారంగా నిర్వహించిన 'ఫేమ్ ఇండియా–ఏషియా పోస్ట్ సర్వే 2026' ఫలితాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఈ సర్వేలో మొత్తం 1,000 పాయింట్లను ప్రామాణికంగా తీసుకుని పనితీరు ఆధారంగా ర్యాంకులను కేటాయించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 15 మంది ముఖ్యమంత్రులను ఎంపిక చేయగా, మొదటి పది స్థానాల్లో నిలిచిన వారికి 'ది బెస్ట్ సీఎం' హోదాను, మిగిలిన ఐదుగురికి 'ముఖ్యమంత్రి పంచరత్న' గుర్తింపును ప్రదానం చేశారు.
ఈ సర్వేలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 897 పాయింట్లతో దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా నిలిచారు. శాంతిభద్రతల పరిరక్షణ, మౌలిక వసతుల కల్పన, కఠిన పాలనా నిర్ణయాలతో ఆయన అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ 881 పాయింట్లతో రెండో స్థానాన్ని, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ 874 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. తొలి మూడు స్థానాలనూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన ముఖ్యమంత్రులే కైవసం చేసుకోవడం విశేషం.
కాగా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (ఆమ్ ఆద్మీ పార్టీ) 856 పాయింట్లతో 4వ ర్యాంకు సాధించగా, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (జేఎంఎం) 844 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 842 పాయింట్లతో దేశంలోనే 6వ ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలవగా, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ 838 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 827 పాయింట్లతో 8వ ర్యాంకును కైవసం చేసుకున్నారు.
టాప్ 10 జాబితాలో చివరి రెండు స్థానాల్లో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ 803 పాయింట్లతో 9వ స్థానంలో, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా 802 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచారు. ఇక తర్వాతి స్థానాల్లో నిలిచిన ముఖ్యమంత్రి పంచరత్న విభాగంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (788 పాయింట్లు), ఢిల్లీకి చెందిన రేఖా గుప్తా (768 పాయింట్లు), జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (766 పాయింట్లు), గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ (760 పాయింట్లు), రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ (746 పాయింట్లు) వరుసగా స్థానాలు పొందారు.
ఏషియా పోస్ట్ సంస్థతో కలిసి ఫేమ్ ఇండియా దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు అత్యంత పకడ్బందీగా ఈ సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనం మొత్తం మూడు దశల్లో సాగింది. మొదటి దశలో సోషల్ మీడియా వేదికలు, వార్తా పత్రికల్లో లభించిన ప్రజా స్పందనను విశ్లేషించారు. రెండో దశలో సమాజంలోని వివిధ రంగాలకు చెందిన మేధావులు, జర్నలిస్టులు, పౌర సమాజ ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించారు. చివరిగా మూడో దశలో క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజలతో మాట్లాడి, ప్రభుత్వ పథకాల అమలుపై వారి అనుభవాలను క్రోడీకరించి తుది స్కోరును ప్రకటించారు.
1 readers have reacted
